Sunday, January 5, 2025

విద్యాశాఖలో సంచలనం

యాదాద్రి జిల్లాలో 16 మంది ఉపాధ్యాయుల సర్వీస్​ రిమూవల్​

విద్యాశాఖలో సంచలనం రేగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులను, విద్యాశాఖ సీరియస్ గా పరిగణించి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వారి సర్వీస్ ల నుండి తొలగించాలని నిర్ణయించారు. ఈ ఉపాధ్యాయుల్లో 9 మంది మహిళ ఉపాధ్యాయులు కూడా ఉండగా, మొత్తం 16 మంది ఎస్జిటి లు సర్వీస్ నుండి తొలగింపుకు గురయ్యారు. ఈ ఉపాధ్యాయులు, సుదీర్ఘ కాలం పాటు విద్యా సంస్థల విధులకు హాజరుకావడం లేదని అధికారులు గుర్తించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తూ.. పాఠశాలలకు రాకుండానే రాజభోగాలు అనుభవిస్తున్నారు. దీంతో విచారణ జరిపిన రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే స్కూల్ అసిస్టెంట్ గీతారాణి, ఎస్జీటీలు విజయలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, ఉమారాణి, ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్ హమీద్, స్వప్న, మాధవి, నవీన్ కుమార్, ఎం. ఉమాదేవి, క్రాంతి కిరణ్, జె. ఉమాదేవి, నర్సింహారావు, శైలజ, భాగ్యలక్ష్మి, కిరణ్ కుమారి 2005 నుంచి 2022 వరకు అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారు. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ఐదు దఫాలుగా వీరికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. గైర్హాజరుపై సదరు ఉపాధ్యాయులు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి.. 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ దీర్ఘకాలికంగా గైరాజరైన 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీఈవో సత్యనారాయణ తెలిపారు. మరోవైపు.. ఏ ఏ జిల్లాల్లో ఇంకెంత మంది ఉపాధ్యాయులు సుదీర్ఘ కాలంగా విధులకు గైర్హాజరవుతున్నారో వారి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అన్ని జిల్లాల డీఈవోలను ఆదేశించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది డుమ్మా రాయుళ్లు..!
రోజు బడికి వెళ్లి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు.. అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.కేవలం యాదాద్రి జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఉపాధ్యాయులు ఏళ్ల నుంచీ ఇతర కారణాలు సాకుగా చూపి విధులకు గైర్హాజరవుతున్నారు. అనారోగ్య కారణాలు, ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లడం, ఇతర ఇన్వెస్టిగేషన్​ ల కోసం ప్రభుత్వం మంజూరు చేసే సెలవును ఆసరాగా చేసుకుంటున్న ఉపాధ్యాయులు స్కూలుకు వెళ్లడం మానేసి, వ్యాపారాలు, ఇతరాత్ర పనులు చూసుకుంటున్నారు. అయినా నెల నెలా ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్నారు. ఇంకొందరు విదేశాలకు వెళ్లి ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోతున్నారు. దీంతో ఆయా స్కూళ్లలో విద్యాబోధన పడకేస్తున్నది. మరోవైపు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల తీరుతో ఇటీవల విద్యా శాఖకే మాయని మచ్చలు ఏర్పడుతున్నాయి. నిబంధనల ప్రకారం.. ఆరోగ్యం బాగా లేని ఉపాధ్​యాయులకు మండల స్ధాయిలో సదరు ఎంఈవో నాలుగు నెలల పాటు సెలవులు ఇవ్వవచ్చు. అదే డీఈవో స్ధాయిలో ఆరు నెలలు, రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఐదేళ్ల పాటు సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుంటోన్న గురువులు విదేశాలకు వెళ్లి అక్కడ ఇతర పనులు చేసుకుంటున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. తాజాగా వారందరినీ విధుల నుంచి శాశ్వతంగా తొలిగించేందుకు సిద్ధమవుతున్నది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com