-
తిరుమల లడ్డూ ప్రభావం..
-
అప్రమత్తమైన తెలంగాణలో ప్రముఖ ఆలయాలు
-
ప్రభుత్వ పరీక్షా కేంద్రంలో నెయ్యి పరీక్ష
తిరుమల లడ్డూ ప్రసాదంపై చెలరేగిన వివాదం నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రముఖ ఆలయాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ఆలయాల్లో లడ్డూ పసాదాల్లో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించుకునే పనిలో పడ్డాయి. ఇతర పులిహోర, తదితర ప్రసాదాల్లో నాణ్యత ప్రమాణాలు ఏమేరకు ఉన్నాయనే విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. ఆహార పదార్ధాలను పరీక్షించే హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి పరీక్షల కోసం పంపిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తెలంగాణ తిరుపతిగా భాసిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం, వరంగల్ భద్రకాళి అమ్మ వారి ఆలయం అధికారులు లడ్డ్డూ ప్రసాదాల్లో వాడే నెయ్యి తదితర పదార్థాలను పరీక్షా కేంద్రాలకు పంపించారు.
మిగిలిన ప్రముఖ ఆలయాల అధికారులు కూడా ఇదే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డ్డూ నాణ్యతపై పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో లడ్డ్డూ ప్రసాదాల్లో ఏ మేరకు నాణ్యత ఉందో తెలుసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ముందుగానే జాగ్రత్త పడితే మంచిదనే భావనతో ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, జోగులాంబ, సికింద్రాబాద్ గణేష్ ఆలయం, కొండగట్టు, బాసర సరస్వతి అమ్మవారి ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, వంటివి ఎన్నో చారిత్రాత్మక ఆలయాలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి, అమ్మవార్ల దివ్య ప్రసాదాల్లో ఏమాత్రం తప్పు జరిగినా అది విపరీత పరిణామాలకు దారితీస్తుందనే కోణంలో ప్రభుత్వం నుంచి పరోక్షంగా అందిన సమాచారంతో ఆలయాల కార్యనిర్వహణాధికారులు అంతా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యి, ఇతర వస్తువుల్లో నాణ్యత పరీక్షించడంతో పాటు ఆయా సరఫరాదారుల నుంచి కూడా ప్రమాణాలకు సంబంధించిన నివేదికలను కచ్చితంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో ఆలయాలు, అటు నెయ్యి సరఫరా చేసే డెయిరీ వర్గాలు అలర్ట్ అయ్యాయి. యాదాద్రిలో ప్రసాదం నాణ్యతపై ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకుని లడ్డూలో వాడే నెయ్యిని హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే తయారీలో వినియోగిస్తున్నారు.
యాదాద్రి క్షేత్ర సందర్శన కోసం వచ్చే భక్తులు లడ్డూ, పులిహోర ప్రసాదాల కొనుగోలుకు అత్యంత ఆసక్తి కనబరుస్తారు. వారి నమ్మకం, విశ్వాసాలకు తగ్గట్లే ప్రసాదం నాణ్యతలో ఎలాంటి లోపం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు మీడియాకు వెల్లడించారు. లడ్డూ తయారికీ ఉపయోగించే పదార్థాలను ప్రభుత్వ సంబంధిత శాఖల ధృవీకరణతోనే ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని ప్రముఖ కంపెనీ మదర్ డెయిరీ ద్వారా కేజీ రూ.609కి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అవసరానికి తగ్గట్లు కంపెనీ నుంచి నెయ్యి తెప్పించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అలాగే వరంగల్ భద్రకాళీ అమ్మ వారి ఆలయం అధికారులు కూడా తమ లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యి తదితర వస్తువులను పరీక్షలకు పంపిస్తున్నట్లు తెలిపారు. కాగా మిగిలిన ప్రధాన ఆలయాల్లో కూడా లడ్డ్డూ ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిని అత్యంత పవిత్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.
తిరుమల లడ్డ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించారనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయా ఆలయాలకు సరఫరా చేస్తున్న నెయ్యిలో ఏమాత్రం తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం ఒక్కో ఆలయానికి ఒక్కో డెయిరీని నెయ్యిని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ధరల్లో వ్యత్యాసం ఎలాగున్నా నాణ్యతలో రాజీ లేకుండా చూడాలని భావిస్తున్నారు. ప్రభుత్వ డెయిరీ అయిన విజయ పాల ఉత్పత్తుల కంపెనీ నుంచి నెయ్యిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎటువంటి విమర్శలు, ఆరోపణలకు అవకాశం లేకుండా విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల డెయిరీల నుంచి కొన్ని ఆలయాలకు నెయ్యి సరఫరా అవుతోంది. ఆ నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు ఎంత మేరకు ఉన్నదీ నిర్ధారించుకుంటున్నాయి. ప్రముఖ ఆలయాలే కాకుండా చిన్న చిన్న ఆలయాల్లో కూడా ప్రసాదాలకు వినియోగించే ఉత్పత్తులను నాణ్యతతో ఉంచాలని భావిస్తున్నారు.