సోమవారం పాతబస్తీలోని సంతోషన్నగర్, యాకుత్‌పురాలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. భూదాన్ భూముల వ్యవహారంలో ఈ తనిఖీలు చేపట్టారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఈఐపీఎల్ కంపెనీ భూములు విక్రయించింది. ఈఐపీఎల్ కంపెనీకి సుకూర్ బినామీగా ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో సుకూర్, అతడి బంధువు షర్ఫన్, మరో ఇద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి రంగారెడ్డి కలెక్టర్, మహేశ్వరం తహసీల్దార్‌ను ఈడీ విచారించింది. భూదాన్ భూమికి లేఅవుట్ వేసి విక్రయించిన మునావర్‌ఖాన్, ఖదీర్ ఉన్నిసా ఇళ్లల్లో అధికారులు సోదాలు చేశారు. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారించింది. మీర్‌పేట పరిధి విరాట్‌నగర్‌లో సుకూర్ అనే వ్యక్తి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
కాగా, ఐఏఎస్ అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలోని 17వ సర్వే నంబర్‌లో 386 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదే సర్వేనంబర్‌లోని ప్రైవేట్ భూమి 26 ఎకరాల్లో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి సీలింగ్ ల్యాండ్‌ను కూడా కలుపుకున్నాడు. అయితే తమ భూమిలో గోపాల్ యాదవ్ వెంచర్ వేశాడని పలువురు రైతులు ఆరోపిస్తూ అప్పటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నామని, తమ పేరిట పట్టాలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది.