- సూర్యాపేటలో గవర్నర్ పర్యటన
– జిల్లా అధికారులతో సమీక్ష
– అభివృద్ధి పొలాలు ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి
– గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ జిల్లాల పర్యటకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. ఇటీవల వర్షాలతో జరిగిన నష్టం, తీసుకున్న చర్యలను పరిశీలించారు. జిల్లాకు వచ్చిన గవర్నర్ కు ముందుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందేందుకు అధికారులు పాటుపాలని, తద్వారా మెరుగైన జీవితాలను అందిస్తామన్నారు. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనత 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమని, ఇందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో సమర్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలలో రక్తహీనత నివారించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న
475 గ్రామపంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషమని, స్వచ్ఛభారత్ అనేది ఒక కార్యక్రమం కాదని, ఇదొక ఉద్యమమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని, ప్రత్యేకించి సూర్యాపేట లాంటి జిల్లాలోని ప్రజలను దారిద్రరేఖ నుండి పైకి తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు అందర్నీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సూర్యపేట జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల కార్యక్రమాలు బాగున్నాయని, భవిష్యత్తు అభివృద్ధి మహిళా సాధికారత పై ఆధారపడి ఉందని, ఈ విషయం తాను కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన సందర్భంగా సహాయక మహిళలు వారు తయారు చేసిన చేతి వృత్తుల ప్రదర్శన లో గుర్తించానని చెప్పారు.
సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యం, విద్య రంగాలను పరిశీలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నాయని, ప్రత్యేకించి విద్యలో 2024లో పదో తరగతిలో 96.91% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. సమాజం అంటే సంపద కాదని, సమాజం అంటే సంస్కృతి అని ఆయన చెప్పారు.
వ్యవసాయానికి ప్రాధాన్యం = మంత్రి ఉత్తమ్
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఐటి, సాఫ్ట్ వేర్, ఫార్మా ,సైన్స్ రంగాలలో తెలంగాణ దేశంలోనే కాకుండా, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదని, వ్యవసాయంలో సైతం ముందుందని, 28 వేల కోట్ల బడ్జెట్ ను వ్యవసాయానికి కేటించడం జరిగిందన్నారు.
జిల్లాకు వచ్చిన గవర్నర్ కు ముందుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి సంవత్సరం ఆరు లక్షల నూతన ఆయకట్టును సృష్టించి వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాలలో చురుకైన సహకారం అందిస్తున్నదని, ఆహార భద్రతలో భాగంగా దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నామని, వారు మెరుగైన ఆహారాన్ని భుజించాలన్న ఉద్దేశంతో వచ్చే జనవరి నుండి సన్నబియాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కు అదనంగా 500 రూపాయల బోనస్ ను సన్నధాన్యానికి ఇస్తున్నామని, దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఈ వానాకాలం 150 లక్షల మెట్ టన్నుల వరి ధాన్యం రాష్ట్రంలో పండించినట్లు తెలిపారు.