- జిల్లాల కలెక్టర్లు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలి
- 40 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు
- శాంతి యుతంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి
- జిల్లాల కలెక్టర్లు,ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు
ఈనెల 16వ తేదీ నుండి సాగు నీటి సంఘాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, 40 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.అమరావతి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు,ఇరిగేషన్ శాఖ సిఈలు,ఎస్ఈ ల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, కాడా కమీషనర్ రామసుందర రెడ్డి,ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నాటి ఎన్టీఆర్ హయాం నుండి చంద్రబాబు నాయుడి వరకు సాగు నీటి రంగంపై ఎక్కువ ఆశక్తి అని అందుకే ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.కానీ గత అయిదేళ్ళ పాలనలో సాగు నీటి వ్యవస్దలకు సరైన కేటాయింపులు లేక సాగు నీటి సరఫరా,మురుగు నీటి పారుదల వ్యవస్దలు నిర్వీర్యమయ్యాయని,కనీస పర్యవేక్షణ లేకపోవడంతో సిల్ట్,పూడికతీత,తూటకూర తొలగింపు పనులు చేయకపోవడంతో చివరి పొలాలకు సాగు నీరు అందని పరిస్దితి ఉండేది.అంతేకాకుండా చిన్న పాటి వర్షాలకు సైతం వేల ఎకరాలు నీట మునిగి జలాశయాలుగా తయారయ్యేవి.సాగు నీటి రంగంలో కనీసం జవాబుదారీతనం,పారదర్శకత లోపించాయని,రైతుల భాగస్వామ్యం లేదని,గత ప్రభుత్వం సాగు నీటి సంఘాల రద్దు చేయడం అంటే రైతులు లేని వ్యవసాయం లాంటిదే అని అన్నారు మంత్రి నిమ్మల.సాగు నీటి వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించాలనే ముఖ్యమంత్రి సంకల్పం మేరకు,రాష్ట్రంలోని 6219 సాగు నీటి సంఘాలకు,252 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు,56 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు.
లోకలైజేషన్ పూర్తయిన కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వెంటనే కాడా కమీషనర్ కు ప్రతిపాదనలు పంపాలని,కొత్త జిల్లాల ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు.నీటి పారుదల శాఖ ద్వారా విస్తీర్ణాన్ని నిర్ణయించాల్సి ఉందని,పునర్విభజన పూర్తయిన తరువాత రెవిన్యూ శాఖ ఓటర్ల జాబితాను సిద్దం చేస్తుందని,సిసిఆర్సీ కార్డులు ఉన్న కౌలుదారులను కూడా ఓటర్ల జాబితాలో చేర్చాలని లేని పక్షంలో ఒరిజినల్ పట్టాదారు ఓటరుగా నమోదు అవుతారని అన్నారు.ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని,ఇలా అన్ని జిల్లాల్లో ఎటువంటి గొడవలూ లేకుండా సాగు నీటి సంఘాల ఎన్నికలు జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ఇప్పటి నుండే కలెక్టర్లు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటూ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలని సూచించారు మంత్రి నిమ్మల రామానాయుడు.