హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాగా ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్, బిఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికయ్యారు.
వీరు కాకుండా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. దీంతో ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ ఐదుగురు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్త ఎమ్మెల్సీలకు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు.