- నిధుల సేకరణపై హెచ్‌ఎండిఏ అధికారుల కసరత్తు
- ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు 200 ఎకరాల భూమిని
- ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాలని నిర్ణయం
- భూ నిర్వాసితులకు టిడిఆర్ లేక నష్ట పరిహారమా…?
- త్వరలో తేల్చనున్న అధికారులు
కోడ్ పూర్తి కాగానే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా భూ సేకరణ కోసం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అవసరమైన భూసేకరణపై హెచ్‌ఎండిఏ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే భూ నిర్వాసితులకు నష్టపరిహారమా లేక లేక టిడిఆర్ (ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్)ను వర్తింప చేయాలా అన్న దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. జేబిఎస్ నుంచి శామీర్‌పేట వరకు భూ సేకరణలో భాగంగా నిర్మాణం కోసం భూమిని అధికారులు గుర్తించారు.
దీంతోపాటు ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు 200 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 300 ప్రైవేటు నిర్మాణాలను అలాగే డబుల్‌డెక్కర్ కారిడార్‌కు 200 పైగా నిర్మాణాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో భూములను ఇవ్వడానికి మిలిటరీ ఎస్టేట్ భూములు, సికింద్రాబాద్, కంటోన్మెంట్ బోర్డుకు చెందిన భూములను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది.
నష్ట పరిహారాన్ని ఎలా చెల్లించాలి…
అయితే వీరికి నష్ట పరిహారాన్ని ఎలా చెల్లించాలన్న దానిపై త్వరలో ప్రభుత్వం ఓ నిర్ణయం ప్రకటించిన తరువాత పరిహారాన్ని చెల్లించాలని హెచ్‌ఎండిఏ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సేకరించాల్సిన ప్రైవేటు ఆస్తులపై అధికారులు మార్కింగ్ పనులు చేపట్టారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ఇప్పటికే హెచ్‌ఎండిఏ, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, డిఫెన్స్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించి భూసేకరణపై ఒక నిర్ణయానికి వచ్చింది.
ప్రభుత్వానికి భారం లేకుండా టిడిఆర్….
ఎన్నికల కోడ్ ముగియగానే ఆయా పనులను చేపట్టడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే అవసరమైన నిధులు ఎలా సేకరించాలన్న దానిపై కూడా హెచ్‌ఎండిఏ అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే నష్టపరిహారం కంటే కూడా భూములు కోల్పోయే వారికి టిడిఆర్‌ను వర్తింప చేయాలని అధికారులు భావిస్తున్నారు. టిడిఆర్ పొందిన భూ యజమానులు (భూములు కోల్పోయే వారు) మిగిలిన స్థలంలో అవసరమైన మేరకు ఒకటి లేదా రెండు ఫ్లోర్లు వేసుకునేందుకు అనుమతి ఉంటుంది. దానికి సంబంధించి జిహెచ్‌ఎంసికి, హెచ్‌ఎండిఏలకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ విధానం వల్ల హెచ్‌ఎండిఏపై నష్టపరిహారం భారం పడకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
జెబిఎస్ నుంచి హకీంపేట మీదుగా
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి డెయిరీఫాం రోడ్డు వరకు 5.32 కి.మీ. మేరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. మొత్తం రూ.1580 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 74 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో డిఫెన్స్ ల్యాండ్ 56 ఎకరాల వరకు, ప్రైవేట్ భూములను 9 ఎకరాల వరకు సేకరించాల్సి వుంటుంది. ఇక జెబిఎస్ నుంచి హకీంపేట మీదుగా శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ను కలిపే ఎలివేటెడ్ కారిడార్‌ను రూ.2,232 కోట్లతో నిర్మిస్తున్నారు. 11.12 కి.మీ. మేరకు నిర్మించే ఈ ప్రాజెక్టుకు 197 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది. ఇందులో 113 ఎకరాలు డిఫెన్స్‌కు చెందిన భూములు కాగా, మరో 84 ఎకరాలు ప్రైవేటు భూములను సేకరించాలని అధికారులు నిర్ణయించారు.