ట్రంప్ ను ఇంటర్వూ చేసిన ఎలాన్ మస్క్
ప్రపంచ వ్యాప్తంగా వీక్షించిన కోట్లాది మంది
అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికెన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ట్విట్టర్-ఎక్స్ లో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వూ ను ట్విట్టర్ లో లైవ్ టెలిక్యాస్ట్ చేయగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూశారు. ఈ ఇంటర్వూలో ట్రంప్ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. తనపై హత్యాయత్నం జరిగినప్పటి నుంచి తాను దేవుడిని మరింత నమ్మడం ప్రారంభించానని చెప్పారు. అక్రమ వలసలే తనను కాపాడాయని ఈ సందర్బంగా ట్రంప్ అన్నారు. గత నెలలో డొనాల్డ్ ట్రంప్ పై పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యాయత్నం జరిగిన విషయాన్ని తన ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ ప్రస్తావించగా.. నా దగ్గర అంత రక్తం ఉందని నాకు తెలియదని కామెంట్ చేసిన ట్రంప్, నేను తీవ్రంగా గాయపడలేదు కాబట్టి ఈ విధంగా ఆలోచించడం ఉత్తమమని అన్నారు.
దేశానికి సంబందించిన ఇమ్మిగ్రేషన్ విషయంలో తన వైఖరి కారణంగానే తనను ఓ వర్గం టార్గెట్ చేసిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మీ ధైర్యాన్ని చాలా మంది మెచ్చుకుంటారని తాను అనుకుంటున్నట్లు ఈ సందర్బంగా ట్రంప్ అన్నారు. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ పై ఈ ఇంటర్వ్యూలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు డొనాల్ట్ ట్రంప్. తాను చేసిన ప్రతి పనిని ఆమె చేస్తోందని, ఆమె ఫేక్ అని అన్నారు. కమలా హారిస్ కనుసన్నల్లోనే దేశ సరిహద్దులు దాటుతున్న అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిందని ఆరోపించారు ట్రంప్.