ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… 12 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య గురువారం భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని దక్షిణ అబూజ్‌మడ్ అడవుల్లో భద్రతా సిబ్బంది మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మరణించారు. గురువారం ఉదయం 3 గంటల నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ పోలీసులు వెల్లడించారు.
కూంబింగ్‌లో నారాయణపూర్, దంతెవాడ, జగదల్‌పూర్, కొండగాల్ జిల్లా భద్రతా బలగాలతోపాటు డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కాగా, నవంబర్ 30న ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులు, పోలీసులకు మధ్య భీకరపోరులో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. రెండు ఏకే 47 తుపాకులతోపాటు మరో ఐదు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కాగా, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన ఏగోలపు మల్లయ్య ఉన్నారు.