- రూ.1,11,11,111 నజరానా
- కర్ణిసేన ఓపెన్ ఆఫర్
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేస్తే పోలీసులకు భారీగా రివార్డు ఇవ్వనున్నట్లు కర్ణిసేన ప్రకటించింది. కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షెకావత్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. లారెన్స్ బిష్ణోయ్ దేశానికి ముప్పు అని షెకావత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, గుజరాత్ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. గ్యాంగ్ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్రం, గుజరాత్ అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
లారెన్స్ బిష్ణోయ్‌ని చంపిన పోలీసు అధికారులకు రూ.1,11,11,111 రివార్డు ఇస్తామని పేర్కొన్నారు. బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన ఏ పోలీసుకైనా ఈ రివార్డ్ మొత్తాన్ని ఇస్తానన్నారు. తమ వారసత్వమైన సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన లారెన్స్ బిష్ణోయ్‌ని హత్య చేసిన వారికి రూ.1,11,11,111/- (కోటి పదకొండు లక్షల పదకొండు వేల పదకొండు వందల పదకొండు) బహుమతిగా ఇస్తామన్నారు. ధైర్యవంతుడైన పోలీస్ కుటుంబానికి భద్రతతో పాటు పూర్తి ఏర్పాట్లు కల్పించే బాధ్యత తమదేనన్నారు. కుటుంబ భవిష్యత్‌కు భరోసాగా ఈ రివార్డును అందజేస్తామన్నారు.
డ్రగ్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్‌లోని సబర్మతి జైలులో లారెన్స్ బిష్ణోయ్ ఉన్నాడు. ఏప్రిల్‌లో ముంబయిలో సినీ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. డిసెంబర్ 5, 2023న జైపూర్‌లో కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఆ తర్వాత ఆయనను హతమార్చింది తామేననంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. హత్యకేసులో ఈ ఏడాది జూన్ 5న ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. అందులో రోహిత్ గోదార ప్రధాన సూత్రధారిగా తేలింది. గోల్డీ బ్రార్, వీరేంద్ర చరణ్‌తో పాటు మరికొందరు హత్యకు పథకం పన్నారని ఆరోపణలున్నాయి. వీరంతా బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నవారే. బిష్ణోయ్ గ్యాంగ్ క్రిమినల్ గ్యాంగ్. దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్నది. సెప్టెంబర్ 2023లో ఖలిస్తానీ మద్దతుదారు సుఖా దునేకేను సైతం ఇదే గ్యాంగ్ హతమార్చింది.