ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్‌లోని బందీపురాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భద్రత బలగాలు తమ సోదాలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా శుక్రవారం బందీపురాలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో.. తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఆ క్రమంలో అటు ఉగ్రవాదులకు, ఇటు భద్రత బలగాలకు మధ్య హోరా హోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో అల్తాఫ్ లల్లి మృతి చెందారు. అదీకాక పహల్గాం దాడి చేసింది మేమేంటూ ఇప్పటికే లష్కరే తోయిబా సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని పలు జిల్లాలో ఉగ్రవాదులు ఏరివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఈ తనిఖీలను చేపట్టింది. మరోవైపు ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాది ఇంటిని సైన్యం పేల్చివేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఉగ్రవాదుల కాల్పులు జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిశీలించనున్నారు. అందులోభాగంగా ఆయన శుక్రవారం శ్రీనగర్ చేరుకున్నారు. ఆర్మీ చీఫ్ పర్యటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఉగ్రవాదులపై దళాలు తీసుకుంటున్న చర్యలతోపాటు.. జమ్మూకశ్మీర్‌లో తీసుకొంటున్న భద్రత అంశాలను ఆయనకు అధికారులు వివరించారు. అదే విధంగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు చేస్తుందంటూ ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్‌కు ఉన్నతాధికారులు వివరించారు.