Tuesday, April 22, 2025

చెరువులు, కుంటల ఆక్రమణలను పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు ?

  • ఎన్‌ఓసిల జారీలో ఇరిగేషన్ శాఖ నిర్లక్షం
  • ముడుపులిస్తే బఫర్‌జోన్, ఎఫ్‌టిఎల్, శిఖం భూములకు కూడా నో ఆబ్జేక్షన్ సర్టిఫికెట్ జారీ

ఎన్‌ఓసీల జారీలో ఇరిగేషన్ అధికారుల అవినీతి హెచ్చుమీరిపోయింది. హెచ్‌ఎండిఏ పరిధిలోని చెరువులు, కుంటల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు లే ఔట్‌లు, పలు నిర్మాణాలకు సంబంధించి ఎన్‌ఓసీ జారీలో మాత్రం లంచాలు తీసుకొని వెంటనే వాటిని జారీ చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్‌ఎండిఏ పరిధి 7 జిల్లాలో విస్తరించడం ఈ జిల్లాల పరిధిలో చెరువులు, కుంటల పరిధిలో లే ఔట్‌లు చేయడానికి బిల్డర్‌లు హెచ్‌ఎండిఏకు దరఖాస్తు చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ఎన్‌ఓసీని జారీ చేసి లక్షలను ఇరిగేషన్ శాఖ అధికారులు దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దరఖాస్తుదారుడిని దారికి తెచ్చుకొని….
లే ఔట్ కోసం హెచ్‌ఎండిఏకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ సంస్థలో పనిచేసే పిఓ, ఏపిఓలు సైట్‌ను సందర్శించి దానికి దగ్గరగా చెరువులు, కుంటలు, నీటి వనరులు ఉంటే దానికి ఎన్‌ఓసి తీసుకురావాలని ఆ లే ఔట్ దరఖాస్తుదారుడికి సూచిస్తారు. దీంతోపాటు సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా లేఖ రాస్తారు. ఇక అక్కడి నుంచి ఇరిగేషన్ అధికారులు సైట్ సీయింగ్ రాకుండా దరఖాస్తుదారుడిని తిప్పించుకొని దారికి తెప్పించుకుంటారు. ముందుగా ఆ లే ఔట్‌కు ఎన్‌ఓసి రాదని, భూమి మొత్తం పోతుందని భయబ్రాంతులకు గురించి దరఖాస్తుదారుడిని దారికి తెప్పించుకుంటారు. అలా లక్షల రూపాయలను వారి నుంచి ముడుపులు తీసుకొని ఫీల్డ్ విజిట్ చేసి ఎన్‌ఓసిని జారీ చేస్తారు. అలా వచ్చిన డబ్బును సీఈ నుంచి కిందిస్థాయి వరకు పంచుకుంటారు.

Also Read: మద్యం బ్రాండ్‌లన్నీ బెల్ట్ షాపుల్లోనే….?

ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో…
ఇలా కొన్ని లే ఔట్‌లకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పట్టించుకోకుండా ఎన్‌ఓసిలను జారీ చేయడం ఇరిగేషన్ అధికారులకే చెల్లింది. గతంలో వందల ఫిర్యాదులు ఎన్‌ఓసీల జారీకి సంబంధించి ఇరిగేషన్ అధికారులపై వచ్చినా కొంతమంది అధికారులపైనే చర్యలు తీసుకోవడం విశేషం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్‌ఓసీల జారీలో భారీగా ముడుపులు అందుకున్నట్టు ఇరిగేషన్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫీల్డ్ సర్వే చేసి నివేదిక ఇవ్వడానికి రెండు సంవత్సరాలు
హెచ్‌ఎండిఏ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన భూములను ఆక్రమణకు గురవుతున్నాయని రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని ప్రభుత్వం రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ శాఖతో కలిసి ఆక్రమణకు గురైన చెరువులు, కుంటల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. అయితే కబ్జాలకు సంబంధించి ఫీల్డ్ సర్వే చేసి నివేదిక ఇవ్వడానికి వారికి సుమారుగా రెండు సంవత్సరాలు పట్టడం వారి అవినీతికి పరాకాష్టగా చెప్పవచ్చు. వారు సర్వే చేసే లోపు చాలా చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు వెలవడంతో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఈ స్థాయి నుంచి ఏఈ వరకు అందరకీ ముడుపులు అందుతుండడంతో బఫర్‌జోన్, పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్‌టిఎల్) భూమి, శిఖం భూములకు సైతం ఎన్‌ఓసీలను జారీ చేయడంలో ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహాం ప్రదర్శిస్తున్నారు.

హైదరాబాద్‌తో పాటు శివార్లలో …..
భద్రాద్రి జిల్లా పాల్వంచలో 35 ఎకరాల్లోని రాతి చెరువుకు సంబంధించిన భూమిలో పది ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురి కాగా, రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాలోని మెయిన్‌రోడ్డు మీద ఉన్న ఓ చెరువుకు సంబంధించిన 4 ఎకరాల భూమికి తప్పుడు ఎన్‌ఓసి సృష్టించి కబ్జాదారులు మెయిన్‌గేట్ ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 5 చెరువులు, జడ్చర్ల, బాలానగర్ మండలాల్లోనూ పలుచెరువులతో పాటు ఎల్బీనగర్, మియాపూర్, మెదక్, ఉప్పల్, పటాన్‌చెరు ప్రాంతాల్లోని పలు చెరువులు కబ్జాదారుల ఆక్రమణల్లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లోని చెరువులు, కుంటలతో పాటు వరంగల్ జిల్లాలోనూ 8 చెరువుల శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. దీంతోపాటు హైదరాబాద్‌తో పాటు శివార్లలో పలు చెరువుల ఎఫ్‌టిఎల్‌లో ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్నాయని ప్రభుత్వానికి గతంలోనే ఫిర్యాదులు అందాయి. అయినా వీటిపై ఇరిగేషన్ అధికారులు మరోసారి విచారణ చేయకపోవడం విశేషం.

రంగారెడ్డి జిల్లాలో 913 చెరువులు, కుంటలు
ఇప్పటికే హైదరాబాద్ జిల్లా పరిధిలో 26 చెరువులు, రంగారెడ్డి జిల్లాలో 133, మెదక్ జిల్లాలో 10 ముఖ్యమైన చెరువుల పక్కన కబ్జాదారులు వారి పనిని అలాగే కొనసాగిస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 28 చెరువులు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 913, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 531, మెదక్ జిల్లాలో 576, సంగారెడ్డి జిల్లాలో 538, సిద్ధిపేటలో 277, యాదాద్రి భువనగిరి జిల్లాలో 269 చెరువులు ఉండగా, హెచ్‌ఎండిఏ పరిధిలోని ఔటర్ రింగ్‌రోడ్డు లోపల 9 మండలాల్లో 23 చెరువులు, కుంటలకు సంబంధించి శిఖం, ఎఫ్‌టిఎల్ పరిధిల్లో చాలావరకు కబ్జాకు గురయినట్టు అధికారులు గుర్తించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com