రేవంత్ సర్కార్ పై తిరగబడ్డ స్మితా సభర్వాల్
కంచ గచ్చిబౌలి భూ వివాదాల మంటలు చల్లారడం లేదు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. తాను రీ పోస్టు చేసినట్లే 2వేల మంది చేశారని వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా పోస్టులపై సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేయడమే ఇందుకు కారణం. దీంతో ఆమెకు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. తాజాగా ఆ నోటీసులపై స్మితా సభర్వాల్ స్పందించారు. ఈ మేరకు ఆమె సంచలన కామెంట్స్ చేశారు. పోలీసులకు తాను పూర్తిగా సహకరించినట్లు స్మితా సభర్వాల్ చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లుగా వెల్లడించారు. తాను రీ పోస్టు చేసినట్లే సోషల్ మీడియాలో దాదాపుగా 2 వేల మంది చేశారని, మరి వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అని స్మితా సభర్వాల్ నిలదీశారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు, చిత్రాల ద్వారా సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలో ఫేక్ ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ చేసిన రీ పోస్టుకు గానూ పోలీసులు నోటీసులు అందించారు.