భారీ ఎన్ కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ ఐదో రోజుకు చేరింది. తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టలో జరిగిన ఎన్‌కౌంటర్ లో భారీగా మావోయిస్టులు మృతిచెందారు. కర్రెగుట్టలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కేంద్ర పారామిలిటరీ బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇదివరకే ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందగా.. శనివారం నాడు ఆ సంఖ్య 28కి చేరినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ సంఖ్యను ధ్రువీకరించాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కర్రెగుట్టల్లో కూంబింగ్
కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కర్రెగుట్టలో గత కొన్ని రోజుల నుంచి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏరియల్ సర్వే ద్వారా ఎప్పటికప్పుడు బలగాలకు సమాచారం అందుతోంది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా, దేవ టార్గెట్ గా కూంబింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. వేల మంది బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయని, మావోయిస్టులను రౌండప్ చేశాయని శుక్రవారం ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కాల్పులకు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. ఇదే నిజమైతే మావోయిస్టులకు ఇది మరో పెద్దదెబ్బ అని చెప్పవచ్చు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారు. అందులో భాగంగానే బలగాలు వీలుచిక్కినప్పుడల్లా కూంబింగ్ చేపట్టి మావోయిస్టులను ఏరివేస్తున్నారు.
జల్లెడ పడుతున్న పారా మిలటరీ బలగాలు
పూజారికాంకేర్, గంజపర్తి, నంబి, భీమవరంపాడు, కస్తూరిపాడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్ట అడవుల్లో భద్రతా బలగాల కూంబింగ్ ఐదోరోజు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న వాజేడు ఏజెన్సీ, వెంకటాపురం ప్రాంతాలను భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి. గతంలో ఈ కర్రెగుట్టపైకి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అపరేషన్ కగార్ లో భాగంగా భద్రతా బలగాలు వ్యూహం మార్చాయి.
ఒకవైపు నుంచి కాకుండా మొత్తం నాలుగువైపుల నుంచి చుట్టుముట్టి, కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టి ఒక్కో ప్రాంతాన్ని మ ఆధీనంలోకి తీసుకుంటూ ముందుకు సాగాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు కర్రెగుట్టలను అన్నివైపుల నుంచి చుట్టుముట్టిన క్రమంలో మావోయిస్టులు, ఫోర్సెస్‌కు మధ్య కాల్పులు జరిగాయి. హిడ్మా సహా కీలక మావోయిస్టు నేతల కోసం భద్రతా బలగాలు కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. మందుపాతరలు అమర్చినట్లు గుర్తించి వాటిని నిర్వీర్యం చేస్తూ బలగాలు ముందుకు సాగుతూ మావోయిస్టులపై కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించాయి. సిబ్బందికి కావాల్సిన ఆహారం, తాగునీరు, ఎమర్జెన్సీ ఐటమ్స్ ఎప్పటికప్పుడు వారికి మరో టీమ్ చేరవేసింది. మావోయిస్టులు మరో ప్రాంతానికి వెళ్లేందుకు అవకాశం లేకుండా అన్నివైపుల నుంచి వారిని దిగ్భందం చేసి ఫలితం రాబట్టారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 28 మంది వరకు మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దాదాపు మూడు, నాలుగు రాష్ట్రాల నుంచి బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొనడం, ఊహించని రీతిలో కూంబింగ్ చేపట్టడంతో మావోయిస్టులకు మరోదారి లేకుండా పోయింది. ఈ క్రమంలో బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇదివరకే వందల మంది మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించారు. అడవులను వదిలి జన జీవన స్రవంతిలో కలిసి పోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు సూచిస్తున్నారు. కొందరు మావోయిస్టులు పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయి వారి మీద ఉన్న రివార్డు అవార్డును సొంతం చేసుకుంటున్నారు. మరికొందరు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొంది కొత్త జీవితం మొదలుపెడుతున్నారు.