ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు మరోసారి ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. తన తల్లి దశ దినకర్మ కార్యక్రమాల కోసం నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న ఆయన, ఈ నెల 10 నుంచి 14 వరకు బెయిల్పై బయటకు రానున్నారు. రాధాకిషన్ రావు తల్లి సరోజినీ దేవి ఈ నెల 3న మృతి చెందారు.
అనారోగ్య కారణాలతో 2వ తేదీ రాత్రి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ మరునాడు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని రాధాకిషన్ రావు నాంపల్లి కోర్టును అభ్యర్థించగా, అందుకు కోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే.