- రాష్ట్రంలో కొత్తగా 16 బీసీ ,ఎస్సీ ,ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు
- గిరిజనుల కోసం ప్రత్యేకంగా మూడు కార్పోరేషన్లు
- కాళేశ్వరం అవినీతిపై రిటైర్డ్ జడ్జి చంద్రఘోష్ నేతృత్వంలో కమిటీ
- భద్రాద్రి,యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిటీ
- అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు
- ఓఆర్ఆర్ చుట్టూ మహిళా రైతు బజార్లు
- గవర్నర్ ఎమ్మెల్సీ కోటా కింద మరోసారి కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్ల తీర్మానం
- రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు
టీఎస్ న్యూస్ :రాష్ట్ర సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నది. బీస్టీ, ఎస్సీ కులాలకు సంబంధించి ఏకంగా 16 కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ కార్పోరేషన్ల ద్వారా ఆయా కులాలను ఆర్ధిక చేయూత తో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఈ భేటికి సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. ఎన్నో ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తోన్న కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వాటికి సంబంధించిన విదివిదానాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇటు అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించిన కాంగ్రెస్ సర్కార్.. వచ్చే ఐదేళ్ళలో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు 15 అంశాలతో కూడిన మహిళా శక్తి పధకాన్ని అమలు చేస్తామన్నారు.ఇందులో భాగంగా మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలను ఇవ్వాలని నిర్ణయించామన్న మంత్రులు.. ఆయా సంఘాలకు ఏటా రూ. 20 వేల కోట్ల రుణాలు అందించే తీర్మానానికి ఆమోదం తెలిపామన్నారు. మహిళ సంఘలకు రూ. పది లక్షల వరకూ బీమా సౌకర్యం, పాఠశాల నిర్వహణ, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజనం అన్ని ఆయా సంఘాలకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతే కాకుండా ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు 25నుంచి 30 ఎకరాల్లో అమ్ముకునే సౌకర్యం కల్పిస్తామన్నారు.
అలాగే మహిళలు సూక్ష్మ పరిశ్రమలు చేపట్టెందుకు ప్రత్యేకంగా రూ. 25 వేల కోట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వయం సహాయక సంఘం లోని 18నుంచి 60 ఏళ్ళ మధ్య మహిళలకు రూ. పది లక్షల జీవిత భీమా సౌకర్యం, అమెజాన్, ఫ్లిప్కార్ట్,బిగ్ బాస్కెట్ లాంటి ఈ కామర్స్ వెబ్ సైట్ లలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయాలు, గ్రామాల్లోని పాఠశాలల్లో పారిశుధ్య, మధ్యాహ్నం భోజనం పథకం బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాలని తీర్మాణం చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఉద్యోగాల కోసం నిరీక్షిస్తోన్న 2,193 మంది 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వివరించారు. అయితే మినిమం టైం స్కేల్‌తో ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు పేర్కొన్నారు. గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ పాలనలో మూతబడ్డ హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణకూ రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోన్న నేపథ్యంలో వేసవిలో నీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. మొదటి విడతగా రాష్ట్రంలో 4.50లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ప్రతీ నియోజక వర్గానికి 3,500 ఇండ్లు కేటాయించాలని నిర్ణయించిన మంత్రివర్గం లబ్ది దారులను గ్రామ సభల్లో ఎంపిక చేయాలని తీర్మాణం చేసింది. చివరగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకం పైనా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ కోదండరాం,అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ కు పంపేందుకు సిద్ధమైంది.
కాళేశ్వరంపై వంద రోజుల్లో విచారణ పూర్తి..!
కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయవిచారణ కోసం ఏర్పాటయిన కమిటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రిటైర్డ్ జడ్జీ జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీకి.. వంద 100 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఇటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం, మరో రిటైర్జ్ జడ్జి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటీ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాల చిట్టా విప్పేందుకు జస్టిస్ చంద్రఘోష్, అలాగే భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి నేతృత్వంలో కమిటీలను నియమించామన్నారు. ఛత్తీస్ గడ్ లో వెయ్యి మెగా వాట్ల విద్యుత్ ను నామినేట్ పద్దతిలో కొనుగోలు చేసి, దళారులకు ధారాదత్తం చేసిన వైనంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇదీలావుంటే.. లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పాలనపరంగా తీసుకుంటోన్న నిర్ణయాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కొత్తగా ఏర్పాటుకానున్న కార్పొరేషన్లు ఇవే..!
1.ముదిరాజ్ కార్పొరేషన్
2.యాదవ కురుమ కార్పొరేషన్
3.మున్నూరుకాపు కార్పొరేషన్
4.పద్మశాలి కార్పొరేషన్
5.పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్
6.లింగాయత్ కార్పొరేషన్
7.మేరా కార్పొరేషన్
8.గంగపుత్ర కార్పొరేషన్
ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC)
9.ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు
10.ఆర్య వైశ్య కార్పొరేషన్
11.రెడ్డి కార్పొరేషన్
12.మాదిగ, మాదిగ ఉప కులాల కార్పొరేషన్
13.మాల, మాల ఉప కులాల కార్పొరేషన్
మూడు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు
14. కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్
15. సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేషన్
16. ఏకలవ్య కార్పోరేషన్