బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదుపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. 126(2),115(2),352,351(2),r/w 189(2),r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఏకశిలా నగర్ లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తనపై ఈటల రాజేందర్ తో పాటుగా మరో 30 మంది దాడి చేశారంటూ ఉపేందర్ తన పిర్యాదులో వెల్లడించారు. ఈటలతో పాటుగా మరో 30 మందిపై కూడా కేసులు బుక్ చేశారు పోలీసులు. ఈటలతోపాటు ఏనుగు సుదర్శన్ రెడ్డి, శివారెడ్డి, బస్వరాజ్, బుబైర్ అక్రమ్ లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చెంప ఛెల్లుమనిపించిన ఈటల
ఎంపీ ఈటల రాజేందర్ ఉగ్ర రూపం చూపించారు. మంగళవారం ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప ఛెల్లుమనిపించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్‌లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పేదల భూములు ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఈటలకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈటల ఘటనా స్థలానికి వెళ్లి రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెంప దెబ్బ కొట్టారు. ఈటలతో పాటు స్థానికులు, బీజేపీ కార్యకర్తలు సైతం బ్రోకర్లను కొట్టడం కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చేయి చేసుకోలేదన్నారు. కానీ పేదలకు న్యాయం చేయడం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. పేదల భూములను ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పోలీస్ కమిషనర్ కు బ్రోకర్లను కలవడానికి సమయం ఉంటుంది.. కానీ, తమను కలవడానికి ఉండదని ఫైర్ అయ్యారు. దొంగ పత్రాలను సృష్టించిన అధికారులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు. కూల్చివేతలు తప్ప ప్రభుత్వానికి ప్రజల కష్టాలు కనిపించడం లేదని మండిపడ్దారు.