కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రమైన ఏపీలోని ప్రధానమైన ఏటికొప్పాక బొమ్మలకు మరింత ఖ్యాతి వచ్చేలా ఈ ప్రకటన ఉంది. దీంతో ఏటికొప్పాల బొమ్మలకు మహర్దశ రానుంది. కేంద్ర ప్రవేశపెట్టనున్న తోలు పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి లభించనుంది. పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి సీతారామన్.. ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను చాటారు. భారతదేశాన్ని టాయ్ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. బొమ్మల కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేశామన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ను మరింత ప్రోత్సహించేందుకు చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ తయారీ మిషన్‌ను ఏర్పాటు చేస్తుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇందులో భాగంగా, భారతదేశాన్ని టాయ్స్ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే 5 సంవత్సరాలకు టర్మ్ లోన్‌ల కోసం 5 లక్షల మంది మహిళలతో పాటు, మొదటిసారి వ్యాపారం చేయాలనుకునే వారికోసం కొత్త పథకం ప్రారంభిస్తామనన్నారు. స్టార్టప్‌ల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని రూ.20 కోట్లకు పెంచినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకత తీసుకొచ్చే కళాకృతుల్లో ఏటికొప్పాక బొమ్మలకు ప్రత్యేక స్థానం ఉంది. తాజా ప్రకటనతో ఇప్పుడు ఆ విలువ మరింత పెరగనుంది.
దీంతో పాటు పాదరక్షలు, తోలు రంగాల కోసం ప్రభుత్వం ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్‌ను ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. “భారతదేశంలోని పాదరక్షలు, తోలు రంగం ఉత్పాదకత, నాణ్యత, పోటీతత్వాన్ని పెంచడానికి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకం డిజైన్ సామర్థ్యం, భాగాల తయారీకి మద్దతు ఇస్తుంది. తోలు పాదరక్షలు, ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంతో పాటు, తోలు నాణ్యత లేని పాదరక్షల ఉత్పత్తికి సైతం ఈ స్కీమ్ మద్దతు ఇస్తుంది” అని ఆమె చెప్పారు. ఈ పథకం 22 లక్షల మందికి ఉపాధిని సులభతరం చేస్తుందని, రూ. 1.1 లక్షల కోట్లకు పైగా ఎగుమతులను అందిస్తుందన్నారు. ఈ క్రమంలోనే బొమ్మల రంగానికి చర్యలు, బొమ్మల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం గురించి కూడా మాట్లాడారు. “భారతదేశాన్ని బొమ్మలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి ఒక పథకాన్ని అమలు చేస్తాం” అని ఆమె పేర్కొన్నారు.
గణతంత్ర వేడుకల్లో మూడో శకటం ఇదే
ఇటీవలే రిపబ్లిక్ పరేడ్ లో యావత్ దేశాన్ని ఆకర్షించిన ఏటికొప్పాక శకటం మూడో స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో పేరు గడించింది. సుమారు 400 ఏళ్ల చరిత్ర గల ఈ బొమ్మలను సహజ సిద్ధమైన పూలు, బెరడు నుంచి వచ్చిన రంగులతో తీర్చిదిద్దుతారు. రాంచీ నుంచి దిగుమతి చేసుకున్న లక్కతో వీటిని తయారు చేస్తారు. ఇక ఈ బొమ్మలపైనే ఆధారపడి విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంతో పాటు కోటవురట్ల ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. వారికి ఈ బొమ్మల తయారీనే జీవనాధారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళలో మహిళలకు సైతం శిక్షణ ఇచ్చి, ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు కేంద్రమూ అందుకు చేతులు కలిపింది. తమ వంతుగా ప్రజలు ఉపాధి అందేందుకు భారత్ ను టాయ్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది. అడవులలో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి ఎండబెట్టి ఈ బొమ్మలను తయారు చేస్తారు. పర్యావరణహితమైన, సహజసిద్ధమైన వనరులతో చేసే ఈ లక్క బొమ్మలు అన్ని వయసుల వారిని మంత్రముగ్దుల్ని చేసేలా ఉంటాయి.