Sunday, April 20, 2025

ఈటీవీ బ్యూరో చీఫ్‌ ఆదినారాయణ మృతి

తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా ప్రముఖుల సంతాపం

సీనియర్‌ జర్నలిస్ట్‌, ఈటీవీ హైదరాబాద్​ బ్యూరో చీఫ్‌ టి.ఆదినారాయణ కన్నుమూశారు. అపార్ట్​మెంట్‌పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్​ రెడ్డి, చంద్రబాబు సహా ప్రముఖులు సంతాపం తెలిపారు. నారాయణ ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆదినారాయణ మరణం పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిబద్ధత కలిగిన ఆయన, సమాజంలో మార్పునకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. నారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌, వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉన్న జర్నలిస్ట్​ నారాయణ అని కొనియాడారు. ఇటీవలి కాలంలో అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటారని ఆశించానని, ఆయన అనారోగ్యం నుంచి కోలుకునేలోపే మరణ వార్త వినడం చాలా బాధాకరమన్నారు. ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

నారాయణ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. బాధాతప్త హృదయంతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రెండున్నర దశాబ్దాలుగా ఈటీవీలో పని చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నిబద్ధత గల జర్నలిస్టును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదినారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదినారాయణ మృతి పట్ల మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు సంతాపం తెలిపారు. చిన్న వయస్సులోనే ఆయన మరణించడం చాలా బాధాకరమని కేటీఆర్ అన్నారు. ఆయన అకాల మరణం చాలా బాధించిందని హరీశ్‌ రావు తెలిపారు.

ఆదినారాయణ మరణం పట్ల మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్, తుమ్మల సంతాపం ప్రకటించారు. ఆదినారాయణ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరి మన్ననలు పొందిన వ్యక్తి ఆదినారాయణ అని బండి అన్నారు. ఆయన పార్థివదేహం వద్ద ప్రభుత్వం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి నివాళులర్పించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com