* అంతా సెటిల్ చేశాం
*డ్రీమ్ వ్యాలీ విల్లాల నిర్మాణాలు కంటిన్యూ
* ఒప్పందం చేసుకున్న ప్రభుత్వ పెద్దలు ఎవరు..?
టీఎస్, న్యూస్ :
డ్రీమ్ వ్యాలీ నిర్మాణ సంస్థ ప్రభుత్వ పెద్దలతో చేసిన రాయబారం సక్సెస్ అయినట్టేనని చెప్పుకుంటున్నది. ఇమాజిన్ విల్లాలపై ఫిర్యాదులు వస్తున్నా.. ఇటు సర్కారు కూడా మౌనంగా చూస్తూ టైంపాస్ చేస్తుంది. దీంతో డ్రీమ్ వ్యాలీ యాజమాన్యం ఇప్పుడు బహిరంగ ప్రచారానికి దిగింది. “ నోటీసులు ఇస్తే..ఏమవుతుంది.. ఇప్పుడేం కాదు.. అంతా మాట్లాడుకున్నాం.. సెటిల్ చేశాం. కన్స్ట్రక్షన్ ఎవరూ ఆపరు.. సీఎం దగ్గర కూడా అంతా ఒకే..” అంటూ కొనుగోలుదారులకు చెప్తూ నిర్మాణ పనులు వేగం పెంచారు. ప్రస్తుతం ఇమాజిన్ విల్లాలు తుది దశకు చేరుకున్నాయి. మూడుసార్లు నోటీసులు ఇచ్చి, రెండుసార్లు సర్వే చేసి, 111 జీవోలో నిర్మిస్తున్నారని, ఈ నిర్మాణాలు అక్రమమని రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిన నివేదిక ప్రస్తుతం ఉత్తి కాగితాలుగానే మారిపోయాయి.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాగారం జాగీర్ రెవిన్యూ పరిధిలో 111 జీవోను ఉల్లంఘించి ఈ విల్లాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై రెవెన్యూ యంత్రాంగం నిగ్గు తేల్చినా.. చర్యలకు మాత్రం వెనకాడుతున్నారు. 111 జీవో పరిధిలో విల్లాలు నిర్మిస్తున్నారని, ఎలాంటి పర్మిషన్లు లేవని, నిర్మాణాలు నిలిపివేయాలని నోటీసులు ఇచ్చినా ఆగడం లేదని, వాటిని కూల్చివేసేందుకు తమ దగ్గర యంత్రాలు, సిబ్బంది లేరంటూ రెవిన్యూ యంత్రాంగం.. హెచ్ఎండీఏకు లేఖ రాసింది. అయితే, ఈ అక్రమ నిర్మాణాలపై చర్చ జరుగుతున్నప్పుడల్లా ఏదో నోటీసులు ఇస్తున్న హెచ్ఎండీఏ.. ఆ తర్వాత సైలెంట్ అవుతున్నది. కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు. ఈ నోటీసులను సదరు నిర్మాణ సంస్థ యాజమాన్యం చాలా తేలిగ్గా తీసుకుంటుంది. కనీసం రిప్లై కూడా ఇవ్వడం లేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్నుంచి కూడా సరైన నివేదిక రాలేదని ఇటు హెచ్ఎండీఏ చెబుతున్నది.
సర్కారుతో సయోధ్య..?
డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ లో విల్లాల నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు లేవంటూ పునాదుల సమయం నుంచి నోటీసులు ఇస్తూ వస్తున్న సంబంధిత అధికారులు.. 10, 12 విల్లాల అక్రమ నిర్మాణాలు అంతిమ దశకు చేరుకుంటున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావీస్తుంది. ఇటు అధికారులకు కూడా దీనిపై ఫిర్యాదులు వచ్చినా.. నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. తప్పుడు నిర్మాణాలు అని తేటతెల్లమైనా కారణాలేమైనా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. డ్రీమ్ వ్యాలీ నిర్మాణ సంస్థ యజమాని.. ప్రభుత్వంలోని ఓ మంత్రి, హెచ్ఎండీఏలోని అధికారులతో రాయబేరాలు సాగించారు. దీంతో కేవలం నోటీసులు ఇవ్వడం.. సైలెంట్ కావడం మాములే అయిపోయింది. తాజాగా ఈ నిర్మాణాలు చివరిదశకు చేరుతున్నాయి. ఇంటీరియల్ వర్క్స్ పూర్తి చేస్తున్నారు. అయితే, ఇటీవల దీనిపై రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిన నివేదిక బహిర్గతం కావడంతో.. అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా.. ఓ నోటీసు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. ఇదే అదునుగా సదరు సంస్థ కూడా నిర్మాణాలను ఎక్కడా ఆపడం లేదు. చుట్టూరా భద్రతను పెంచి నిర్మణాలు చేస్తున్నారు. ఇటీవల దీనిపై పిర్యాదులు ఎక్కువ కావడంతో.. కొనుగోలుదారులు అడిగితే.. నిర్మాణ సంస్థ నిర్భయంగా సమాధానం చెప్తున్నది. తమకేం కాదని.. అంతా సెటిల్ చేశామంటూ చెప్పుతున్నారు.
ఇక, డ్రీమ్ వ్యాలీ ఇమాజిన్ విల్లాల అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ యంత్రాంగం చెబుతున్న వివరణ హస్యాస్పదంగానే మారింది. అనుమతులు లేకుండా విల్లాలు నిర్మిస్తున్నారని, 111 జీవో పరిధిలో నిర్మించడం అక్రమమే కానీ.. వాటిని కూల్చివేసేందుకు తమ దగ్గర యంత్రాలు, అవసరమైన సిబ్బంది లేరని హెచ్ఎండీకు చెప్పింది. ఇదంతా విన్న హెచ్ఎండీఏ.. మొత్తానికి సైలెంట్అయింది. కాంగ్రెస్కు చెందిన ఓ బడా లీడర్ అండగా నిలుస్తుండటంతో.. వీటిపై చర్యలకు వెనకాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.