Monday, March 10, 2025

కోతలు, ఎగవేతలు, కేసులు..

  • రేవంత్ రెడ్డి ఏడాది పాల‌నలో క‌నిపించేవి ఇవే..
  • మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్లు..  
  • తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన ఏడాది అయిపోయింద‌ని,  ఏడాదిలో కోతలు, ఎగవేతలు, కేసులు త‌ప్ప ఏమీ క‌నిపించ‌డంలేద‌ని మాజీ మంత్రి, బిఆర్ఎస్  ఎమ్మెల్యే హ‌రీష్ రావు సెటైర్లు వేవారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే.. వాటికి కోతలు పెట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా ఎగవేస్తున్నారని అన్నారు. బుధ‌వారంతెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న బిఆర్ఎస్  పార్టీ డైరీని ఆవిష్క‌రించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..
డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సభలుగా విలసిల్లాయ‌ని, ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయని చెప్పారు.  ఈ డైరీ తిరగేస్తుంటే 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, మన పార్టీ సాధించిన విజయాలు కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు.  ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఈ డైరీని తమ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఆనాటి డైరీ ఆవిష్కరణ సభలు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే, నేటి సభ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలపడానికి, తిరిగి అధికారంలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడాల‌ని చెప్పారు.

మానకొండూరు సభలో నేను మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డీ నువ్వు రుణమాఫీ.. రైతుబంధు,  తులం బంగారం  మహిళలకు మహాలక్ష్మి, వృద్ధులకు 4 వేల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టావు,  నీపేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఇప్పటినుంచి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్నాను. అందుకు మానకొండురు పోలీస్ స్టేషన్లో నామీద కేసు పెట్టించాడు.  ఇపుడు పోలీస్ స్టేషన్ కు రమ్మని నాకు నోటీసుల మీద నోటీసులు వొస్తున్నాయి.   కేటీఆర్ మీద అక్రమ కేసు పెట్టి, అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేసి, పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నాడ‌ని హ‌రీష్ రావు విమ‌ర్శించారు. లగచర్ల రైతులను అరెస్టు చేసి, 15 రోజులు డైవర్షన్ చేశారని,  అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్ చేశాడ‌ని,  దానికంటే ముందు తెలంగాణ తల్లి విగ్రహం మార్చి అదో 15 రోజులు డైవర్షన్ చేశార‌ని,  టీఎస్ ను టీజీగా మారుస్తున్నా అని ఒక డైవర్షన్ టాక్టిక్స్  తెలంగాణ ఎంబ్లమ్ మారుస్తున్నా అని చెప్పి డైవర్షన్ టాక్టిక్స్ చేశార‌ని విమ‌ర్శించారు.

హామీలు అమలు చేసిందేమన్నా ఉందా?
కల్యాణలక్ష్మి చెక్కులు పిల్లలు పుట్టినంక వొస్తున్నాయ‌ని, ఆరోజు.. పెండ్లి కాకముందే తులం బంగారం ఇస్తా అని చెప్పాడ‌ని, కానీ నేడు పిల్లలు పుట్టాక కూడా చెక్కులు రాని పరిస్థితి ఉంద‌ని అన్నారు.  కేసీఆర్ కిట్లు , న్యూట్రిషన్ కిట్లు, బతుకమ్మ చీర‌లు, రైతుబంధు, బీసీ బంధు, దళిత బంధు  పథకాలు బందు చేశార‌ని ఆరోపించారు. రైతు భరోసా ఎకరానికి 15 వేలు ఇస్తామ‌ని చెప్పి పార్లమెంటు ఎన్నికలకు ముందు ఒక్క పంటకు ఎకరాకు 5 వేలే ఇచ్చార‌ని, వానాకాలం ఎగ్గొట్టార‌ని విమ‌ర్శించారు. మళ్లీ ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికలు వొస్తున్నాయి గనుక మరోసారి రైతుబంధు వేస్తాడు, తర్వాత ఎగ్గొడ‌తాని ఎద్దేవాచేశారు.  రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేశారు. సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. పంటల బీమా అని ఊరించి, రెండు పంటలకు ఎగబెట్టారు. ఏ ఒక్క వర్గానికీ ఇచ్చిన మాట నిలుపుకోలేదు.

రైతులకు మోసం, మహిళలకు మోసం చేసిండు. జార్ఖండ్ లో మహిళలకు 2500 పింఛన్ ఇస్తాన‌ని చెప్పి, మొదటి నెలలోనే మాట నిలబెట్టుకున్నాడు అక్కడి కొత్త సీఎం హేమంత్ సోరెన్. మరి, రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఇస్తా అని బాండ్ పేపర్‌పై సంతకం పెట్టి, 13 నెలలు నిండినా మహాలక్షి అమలు చేయలేదు.  ఏపీలో మొదటి నెలలోనే 2 వేల పింఛన్ 4 వేలు చేసి మాట నిలబెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి 40 లక్షల మంది అవ్వాతాతలకు 4 వేల ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాట తప్పాడు.  ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో 60 మంది పిల్లలు చనిపోయారు. వాళ్లకు సరిగా అన్నం పెట్టకుండా ద‌వాఖాన‌ల‌ పాలు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. సోషల్ మీడియా అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములు.. ఇలా ఎవరు ప్రశ్నిస్తే, వారిపై కేసులు పెడుతున్నాడు. సంక్షేమ పథకాలేమైనయి అంటే డబ్బుల్లేవంటున్నాడు.
కానీ, ఈయన కుటుంబ సభ్యుల భూములకు వేల కోట్లు ఖర్చుపెట్టి కల్వకుర్తి దాకా ఆరు లేన్ల రోడ్లు వేసుకుంటున్నాడు. 50 వేల కోట్లతో మెట్రో రైలు మార్గాలు చేస్తానంటున్నాడు. ఎలివేటెడ్ కారిడార్లు కడతా అంటున్నాడు. కానీ ఆసరా పెన్షన్లకు, రైతు బంధుకు పైసల్లేవంటున్నాడు అని హ‌రీష్ రావు విమ‌ర్శ‌లు గుప్పించారు.

మూసీకి లక్ష కోట్లు ఎక్కడి నుంచి వొస్తున్నాయి. బడా కాంట్రాక్టర్లకు పైసలివ్వడానికి, దిల్లీకి కమీషన్లు పంపడానికి మాత్రం నీకు పైసలు ఎలా వొస్తున్నాయ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు. రైతులకు, మహిళలకు ఇవ్వడానికి నీకు డబ్బుల్లేవా అని నిల‌దీశారు. బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని బద్నాం చేశాడ‌ని, అసెంబ్లీ సాక్షిగా.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4 లక్షల 17 వేల కోట్లు అని స్పష్టం చేశామ‌ని, మీరు ఏడాదిలో 1 లక్షా 37 వేల కోట్ల అప్పు చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండేండ్లు కరోనా ఉన్నా, ఏటా 41 వేల అప్పు మాత్రమే చేసింద‌న్నారు.  కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాదిలోనే 1 లక్ష 37 వేల కోట్ల అప్పు చేసింద‌న్నారు. కేటీఆర్ కు ఆపద వొస్తే కూడా పార్టీ మొత్తం అండగా నిలబడుతుంద‌ని, కేటీఆర్ మీద పెట్టిన కేసు ప్రశ్నించే గొంతుపై, ఒక ఉద్యమకారుడిపై పెట్టిన కేసు అని అన్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రాఫ్ దిగజారిపోతుంది గనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజలను డైవర్షన్ చేస్తున్నాడ‌ని చెప్పారు. కుట్రలో భాగంగానే కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టాడు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆపదొస్తే బీఆర్ఎస్ ఎట్లా నిలబడ్డదో, పార్టీ మొత్తం కేటీఆర్ వెంట ఉంటుంద‌ని హ‌రీష్ రావు పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com