వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలి..
ప్రభుత్వంపై మండిపడిన మాజీ మంత్రి హరీష్ రావు
పెండింగ్ బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం సర్పంచులు గొంతెత్తితే పాపం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు. ఏడాది కాలంగా మాజీ సర్పంచుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికే నాలుగైదు సార్లు హైదరాబాద్ కు వొచ్చి మోర పెట్టుకున్నారు. నిరసనలు తెలిపితే నిర్బంధిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. అప్పులు చేసి, భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేశామని, పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని మాజీ సర్పంచులు వేడుకుంటే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నదని హరీష్ రావు విమర్శించారు. కే
సీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారు. ఉత్తమ గ్రామాలకు తెలంగాణ కేరాఆఫ్ అడ్రస్ గా నిలిచిందంటే, ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచుల పాత్ర కీలకం. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మాజీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మాజీ సర్పంచ్ పట్ల ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ పేద సర్పంచ్‌లు పనులు చేసిన పాపానికి శిక్ష వేస్తున్నారు. ఇదేం న్యాయం అని నిలదీశారు. ఇంకెన్నాళ్ళు వారు ఇలా రోడ్డెక్కి పోరాటం చేయాలి. ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి మాజీ సర్పంచులను చర్చలకు పిలవాలని, వారి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.