పాస్‌పోర్టు రెన్యువల్ కోసం వెళ్లిన కేసీఆర్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్ పాస్‌పోర్టు ఆఫీసు వొచ్చారు. తన పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్ పాస్‌పోర్టును సబ్‌మిట్ చేసి సాధారణ పాస్‌పోర్టును తీసుకునేందుకు కేసీఆర్ పాస్‌పోర్టు కార్యాలయానికి వొచ్చారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌తో పాటు సతీమణి, జోగినపల్లి సంతోష్ ఆఫీస్‌లోకి వెళ్లారు. దాదాపు అరగంట పాటు రెన్యూవల్ ప్రాసెస్ జరిగింది.
పాస్‌పోర్టు రెన్యూవల్ అనంతరం కేసీఆర్ పాస్‌పోర్టు ఆఫీసు నుంచి నందినగర్‌లోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. కాగా.. త్వరలో మాజీ సీఎం అమెరికాకు వెళ్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ కేసీఆర్ పాస్‌పోర్టు రెన్యూవల్ చేసుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పాస్ట్‌పోర్టు తీసుకున్న తర్వాత నెలా, రెండు నెలల్లో అమెరికా ప్రయాణం ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కానీ, సీఎం అవకముందు కూడా కేసీఆర్ అమెరికా వెళ్లిన దాఖలాలు లేవు. మనవడు హిమాన్షు అమెరికాలో ఉన్నతవిద్యాభ్యాసం అభ్యసిస్తున్న నేపథ్యంలో అక్కడకు వెళ్తారని, రెండు నెలల పాటు అక్కడే కేసీఆర్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది.