పండగకి ఊరెళ్లిన సమయంలో దొంగతనం
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షన్నర నగదు, ఆభరణాలు దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దొంగతనం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో లక్షన్నర నగదుతో పాటు దొంగలు భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ చోరీపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబంతో సహా..
పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సమయంలో పొన్నాల లక్ష్మయ్య ఫ్యామిలీ ఇంట్లో లేదని సమాచారం. ఆయన పండుగకు జనగాంకు కుటుంబంతో సహా కలిసి వెళ్లారని తెలుసుకుని.. అదే అదనుగా భావించి దొంగలు దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.