మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సబిత కూడా హాజరయ్యారు. ఈ సమయంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత రెండో విడత సమావేశం జరుగుతుండగానే ఆమె మధ్యలోనే వెళ్లిపోయారు.
తిరుగు ప్రయాణంలో ఆమెను దగ్గరలోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆమెకు చికిత్స చేసిన తర్వాత పరిశీలనలో ఉంచారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె హైదరాబాద్ కు పయనమయ్యారు. సబిత ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నిలకడగా సబిత ఆరోగ్యం.