- రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర దాడులు
- హైదరాబాద్‌తో పాటు మిగతా ప్రాంతాల నుంచి వచ్చే దిగుమతులపై ప్రత్యేక నిఘా
డ్రగ్స్ వినియోగంలో తెలంగాణ ముందుండగా దానిని అణచివేయడంలోనూ ఎక్సైజ్ శాఖ అధికారులు ముందున్నారు. ప్రస్తుతం తెలంగాణలో డ్రగ్స్ వినియోగంలో భాగంగా గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ కూడా పట్టణ ప్రాంతాలకు అందుబాటులోకి రాగా, డ్రగ్స్ రూపంలో గంజాయి, చాక్లెట్లు, హాష్ అయిల్, ఒపిఎం, ఎండిఎంఎ, ఎల్‌ఎస్డి లాంటి డ్రగ్స్ హైదరాబాద్‌తో పాటు పెద్ద పట్టణాల్లో లభిస్తున్నాయి. ఇలాంటి డ్రగ్స్ ఎక్కువగా విదేశాలతో పాటు గోవా, బెంగూళూరు మీదుగా చాలా ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు డ్రగ్స్ అణచివేతకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కృషి చేస్తుంది.
రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి, అదేశాల మేరకు సిబ్బంది హైదరాబాద్‌లో ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌తో పాటు భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌తో పాటు నాటుసారా తయారీ, వినియోగం లేకుండా చేయడానికి ముమ్మర దాడులు చేయాలని ఉన్నతాధికారులు అదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులను నిర్వహిస్తున్నారు. ఆగష్టు 31వ తేదీ నాటికి రాష్ట్రంలో వీటిని రూపుమాపడానికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తమవంతు పాత్రను పోషిస్తుంది. దీనికోసం ప్రత్యేక బృందాలను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏర్పాటు చేసుకుంది.
గంజాయిలో శీలావతి రకానికి బాగా డిమాండ్
ప్రస్తుతం గంజాయి ఎక్కువగా ఒరిస్సా, ఎపి (ఆంధ్రప్రదేశ్)లోని విశాఖ ఎజెన్సీ ప్రాంతంలో సాగు అవుతుంది. దేశంలో గంజాయి సాగులో ఎపి మొదటి స్థానంలో ఉంది. ఈ గంజాయిలో కూడా శీలావతి అనే రకానికి బాగా డిమాండ్ ఉంది.( ఈ రకం గంజాయి ఎక్కువగా ఘాటు , మత్తును అందిస్తుంది.) ఈ రకం గంజాయి ఎక్కువగా విశాఖ ఎజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తారు. గంజాయి రెండో రకం ఎక్కువగా ఒరిస్సా రాష్ట్రంలో పండుతుంది. గంజాయి ఎక్కువగా వినియోగం ఉన్న రాష్ట్రాల్లో గోవా, మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక, తెలంగాణ, ఎపిలో ఎక్కువ శాతం వినియోగంలో ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది.
2024, జూన్ 18వ తేదీ నాటికి 440 గంజాయి మొక్కలు….
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 2022లో 1,480 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 4,556 కేజీల గంజాయి, 24.21 కిలోల గంజాయి చాక్లెట్లను సైతం పట్టుకున్నారు 2023లో 3,311 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోగా, 6355 కేజీల గంజాయిని, 24.8 కేజీల గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. 2024, జూన్ 18వ తేదీ నాటికి 440 గంజాయి మొక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 2682 కేజీల గంజాయిని, 91 కేజీల గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు.
ఆగష్టు 1985లో ఎన్పీడిఎస్ యాక్ట్…
ఎన్డీపిఎస్ ( నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్) ఎన్పీడిఎస్ యాక్ట్ ఆగష్టు, 23వ తేదీ, 1985లో వచ్చింది. ఈ యాక్ట్ కింద అంపేటమిన్, చరస్, కోకైన్, గంజాయి, హెరాయిన్, ఎల్‌ఎస్డి, మెథాడోన్, మార్పిన్, నల్లమందులు వస్తాయి. 2022లో 25.04 కేజీల హషీష్, 110.7గ్రాముల చరస్, 220 గ్రాముల ఒపియం 213.3 గ్రాములు, కోకైన్, 354.3గ్రాములు. హెరాయిన్, 148.01 గ్రాముల ఎండిఎంఎలను పట్టుకున్నారు. 2023లో 12.53 కేజీల హషీష్, 892 గ్రాముల చరస్, 220 గ్రాముల ఒపియం 199 గ్రాములు, కోకైన్, 96. 7గ్రాములు, హెరాయిన్, 129గ్రాముల ఎండిఎంఎలను, పట్టుకున్నారు. 2024లో 1.25 కేజీల హషీష్, 117.2 గ్రాముల చరస్, 6 కేజీల ఒపియం 384.4 గ్రాములు, ఎండిఎంఎ, 80 గ్రాముల హెరాయిన్‌ను పట్టుకున్నారు.
డ్రగ్స్ వినియోగం లేకుండా చేయడమే తమ లక్ష్యం: ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి
డ్రగ్స్ వినియోగం లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం పూర్తి నిర్మూలించడానికి అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌తో పాటు మిగతా ప్రాంతాల నుంచి దిగుమతిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టడానికి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్‌ను అరికట్టడానికి ప్రజలు కూడా సహకరించాలని, డ్రగ్స్ వినియోగం మానవాళికి పెను ప్రమాదమని ఆయన తెలిపారు.