- మాజీ సిఎం కెసిఆర్ విలువలను కాలరాస్తున్నారు…
- అసెంబ్లీకి రాకపోడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కాదా?
- మాజీ సిఎం కెసిఆర్‌పై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని, వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడాన్ని జీర్ణించుకోలేక మాజీ సిఎం కెసిఆర్ ఇలా మాట్లాడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చీల్చిచెండాడుతామని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కంటే చిన్న వయసు వారైన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఎదుట తాను కూర్చోవాలా అని కెసిఆర్ సభకు రావడం లేదని మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు.
మాజీ సిఎం కెసిఆర్ విలువలను కాలరాస్తూ ఇప్పటికీ బుద్ధితెచ్చుకోకుండా ఇంకా పొడుస్తా, నరుకుతా అనే మాటలు సరికావన్నారు. ఏ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రివి అయ్యావో అదే అసెంబ్లీకి రాకపోడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కాదా? మీకు అంత గర్వమా? మీది పొగరుబోతు తనం కాదా? అని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని చులకన భావంతో చూడటం సరికాదన్నారు.
మీరు ఆపని చేసి ఉంటే రాష్ట్రం ఎక్కడో ఉండేది
గడిచిన పదేళ్లు మీ ప్రభుత్వంలో తుగ్లక్ పాలన కాకుండా బాధ్యతయుతంగా సాగించి ఉంటే ఈ రోజు తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడో ఉండేదని జూపల్లి అన్నారు. ఈ హయాంలో ఇటువంటి పనులు చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమానికి, సాగునీటికి నిధులు ఇవ్వలేదని విమర్శిస్తున్నారని మంత్రి జూపల్లి ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవికత బడ్జెట్ అన్నారు.
ఒక్క రూపాయికి కూడా అదనంగా ప్రజలపై పన్నుల భారం మోపలేదన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని, బడ్జెట్‌లో వ్యవసాయానికి 25 శాతం కేటాయించామన్నారు. 17 శాతం నిధులు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల కిందే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. కేవలం ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకోవడానికే దళితబంధు తీసుకువచ్చిన మీరు దళిత బంధు గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయంకు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. రైతులు పండింటిన ధాన్యానికి రూ. 500లు బోనస్ ఇస్తున్నామన్నారు.
గాలిమాటలు మాట్లాడుతున్నారు?
మీ అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని గతంలో మీరు అనుకున్నారు. ఏ విషయంలో నిష్ణాతులని నీ కుటుంబ సభ్యులకు రాజ్యసభ అవకాశం కల్పించారు? అని జూపల్లి ప్రశ్నించారు. బడ్జెట్‌లో వాస్తవాలు ఉంటే గాలిమాటలు మాట్లాడుతూ బడ్జెట్ అంతా ట్రాష్, గ్యాస్ అని విమర్శిస్తున్నారని మంత్రి జూపల్లి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా చాలా చేయాలని ఉన్నా కెసిఆర్ నిర్వాకం వల్ల కుదరడం లేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, కెసిఆర్, ఆయన కుమారుడు, అల్లుడు మాటలు చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. ఏడు నెలలకే రూ.30 వేల కోట్ల అప్పులు తెచ్చామని మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు.