Monday, March 10, 2025

పిసిసి కార్యవర్గం కూర్పుపై క‌స‌ర‌త్తు..

  • విడివిడిగా తెలంగాణ నేతలతో  కెసి వేణుగోపాల్‌ ‌చర్చలు
  • చివరగా సిఎం రేవంత్‌ ‌రెడ్డితో పలు అంశాలపై భేటీ 

పీసీసీ కార్యవర్గం కూర్పుపై తెలంగాణ అగ్రనేతలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ‌సుదీర్ఘ చర్చలు జరిపారు. అందులోభాగంగా రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్‌ ‌విడివిడిగా చర్చలు జరిపారు. ఆ క్రమంలో పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం సీఎం రేవంత్‌ ‌రెడ్డితో కేసీ వేణుగోపాల్‌ ‌సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వొచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గాన్ని ఒకటి లేదా రెండో రోజుల్లో ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు పీసీసీలో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉండొచ్చని కాంగ్రెస్‌ ‌వర్గాలు స్పష్టం చేశాయి. వీరి నియామకాల్లో సామాజిక సమతుల్యం పాటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో ఒకరు మాదిగ, ఒకరు ముస్లిం, ఒకరు లంబాడి, ఒకరు రెడ్డి వర్గాలకు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే 15 నుంచి 20 మందిని పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించే అవకాశముంది. అదేవిధంగా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులపై కూడా నేతలు ఈ సందర్భంగా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సమావేశంలో కేబినెట్‌లో మార్పులపై ఎలాంటి సమాలోచనలు జరపలేదని తెలుస్తోంది.

ప్రస్తుతానికి మంత్రి వర్గ విస్తరణ లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం పేర్కొంటున్నారు. మరోవైపు మంత్రివర్గం కూర్పుపై తెలంగాణ నేతల అభిప్రాయాలను సైతం పార్టీ అధిష్టానం నేతలు సేకరిస్తున్నట్లు ఓ చర్చ అయితే జరుగుతోంది. సీఎం రేవంత్‌, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌మంత్రి ఉత్తమ్‌ ‌కుమర్‌ ‌రెడ్డితోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దీపాదాస్‌ ‌మున్షిలతో ఆ పార్టీ అధిష్టానం ఒక్కొక్కరితో చర్చించి.. అభిప్రాయాలను సైతం సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుందని.. కానీ ఇప్పుడే విస్తరణకు అవకాశం మాత్రం లేదంటూ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. గురువారం  సాయంత్రం సీఎం రేవంత్‌ ‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితోపాటు దీపాదాస్‌ ‌మున్షీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ అధిష్టానంతో వారు సమావేశమయ్యారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే నివేదికను సైతం ఆ పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు సమాచారం. ఈ నివేదికను శాస్త్రీయంగా, సమగ్రం రూపొందించామని వివరించారు. అలాగే ఎస్సీ వర్గీకరణ అంశంపై సబ్‌ ‌కమిటీ, జ్యూడిషియల్‌ ‌కమిటీ ఆమోదించిన తర్వాతే.. కేబినెట్‌ ‌లో ఆమోద ముద్ర వేసినట్లు పార్టీ అధిష్టానానికి వీరు సోదాహరణగా వివరించారు. ఇంకోవైపు ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ కసరత్తు చేస్తోంది. అందుకోసం లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ అధ్యక్షతన ఈ సభలు జరిగేలా ఆ పార్టీ నేతలు ప్రణాళిక బద్దంగా ముందుకు
వెళ్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com