* భుజలాపురం, రంగన్నదర్వాజలో భూముల పరిశీలన
* భూములపై ప్రభుత్వానికి అధికారుల నివేదిక
* మహిళా సంఘాలకు ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు
* సోలార్ పైలెట్ ప్రాజెక్టుగా నర్సాపూర్ ఎంపిక ?
* సోలార్ ప్రాజెక్టుకు సర్వం సిద్ధం
* తొలివిడతలో 5 జిల్లాల్లో ప్లాంట్లు ఏర్పాటు
* 231 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు సర్కారు అడుగులు
రాష్ట్రంలో సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేవాలయాల భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనుంది. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక అభ్యున్నతితో పాటు ఉపాధికి భరోసా లభించనుంది. అయితే సోలార్ పవర్ ప్లాంట్ల తొలుత ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేవాదాయశాఖ అధికారులతో పాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు సేకరిస్తోంది. సోలార్ పైలట్ ప్రాజెక్టుగా నర్సాపూర్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. దాంతో పాటు మరో రెండు జిల్లాల్లో సైతం భూమిని పరిశీలించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం మాత్రం నర్సాపూర్లోనే సోలార్ ప్లాంట్ నిర్మించేందుకు మొగ్గుచూపినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని కొన్ని దేవాలయాలకు చెందిన 719.12 ఎకరాలను ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది.
తొలి విడతలో 5 జిల్లాల్లో ప్లాంట్లు : తొలి విడతలో రాష్ట్రంలోని 5 జిల్లాలో ్ల(సిద్దిపేట, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ) 284.09 ఎకరాలు ఆలయ భూములు ఉండగా 231.05 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది. విద్యుత్ సబ్ స్టేషన్లకు 2 కి.మీ. సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములనే తొలి విడతగా ఎంపిక చేశారు. ఈ భూముల్లోనే దశలవారీగా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. తొలి విడతలో 231 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు సర్కారు అడుగులు వేస్తున్నది. త్వరలో పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన జీవో విడుదల కానున్నట్టు చెబుతున్నారు. మెదక్ నియోజకవర్గంలోని నర్సాపూర్ లక్ష్మీ నారాయణస్వామి దేవాలయానికి 127.37 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి 2 కి.మీ. పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉంది. ఈ భూమిలో 100 ఎకరాల్లో ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. నర్సాపూర్ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
భుజలాపురం, రంగన్నదర్వాజలో భూముల పరిశీలన : తొలి ప్రాజెక్టు విజయవంతమైతే సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అన్ని వివరాలు సేకరించిన తర్వాతే నర్సాపూర్ విషయమై తుది నిర్ణయానికి సర్కారు వచ్చినట్టు తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మండలం భుజలాపురంలో గల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 20.33 ఎకరాల భూమి ఉండగా అందులో 15.33 ఎకరాల భూమిలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ మండలంలోని రంగన్న దర్వాజలో గల సీతారామచంద్రస్వామి ఆలయానికి 24.17 ఎకరాలు ఉండగా 21.34 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గుర్తించారు. ఒక వేళ నర్సాపూర్ ఎంపిక కాకపోతే ఈ రెండు ప్రాంతాల్లోని ఒక ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్టు సమాచారం. అందుకోసం అధికారులు ఈ భూములను పరిశీలించినట్లు తెలిసింది. పైలట్ ప్రాజెక్టు కోసం ముమ్మర కసరత్తు మొదలుకావడంతో త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి.
భూములపై ప్రభుత్వానికి అధికారుల నివేదిక : అందుకోసం దేవాదాయశాఖ అధికారులు హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆలయ భూములను గుర్తించారు. హైదరాబాద్ (సికింద్రాబాద్)లో 32.26 ఎకరాలు, మెదక్ జిల్లాలో 109.06 ఎకరాలు, నల్లగొండ (యాదాద్రి భువనగిరి)లో 26.33 ఎకరాలు, మహబూబ్ నగర్ జిల్లాలో 356.34 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 33.17 ఎకరాలు, కరీంనగర్‌లో 21.31 ఎకరాలు, వరంగల్‌లో 26.34 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 96.36 ఎకరాలు, నిజామాబాద్‌లో 14.35 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఇందులో సబ్ స్టేషన్లు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయ భూములు 292.24 ఎకరాలు, 3 కిలోమీటర్ల పరిధిలో 399.36 ఎకరాలు, 4 కిలోమీటర్ల దూరంలో 11 ఎకరాలు, 5 కిలోమీటర్ల దూరంలో 15.32 ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది.
ఇంధన శాఖ పర్మిషన్ వచ్చాకే ప్లాంట్ ఇన్‌స్టాలేషన్ : ఆలయ భూములను స్వశక్తి మహిళా సంఘాలకు లీజుకు ఇచ్చి సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, మరోవైపు ఆలయాలకు సైతం ఆదాయం సమకూరుతుందంటున్నారు. ఒక్క మెగా వాట్ ప్లాంట్‌కు రూ.3 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో మహిళా సంఘాలు 10శాతం కాంట్రిబ్యూట్ చేస్తే 90శాతం బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయనున్నారు. ఇంధన శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే వారం రోజుల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఒక్క మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తిపై ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. సోలార్ ప్లాంట్లకు ఇంధన శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మహిళా సంఘాలకు భూములకు లీజు ఇవ్వడంతో పాటు రుణాలు మంజూరు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
ఇప్పటి వరకు బ్యాంకులు మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాయి. ఒక్క మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3 కోట్లు వ్యయం అవుతుండటంతో రూ.5 లక్షల గరిష్ట పరిమితి మించుతుండటంతో వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని భావిస్తున్నారు. సాంకేతికంగా సాధ్యం కాని పక్షంలో వడ్డీలో రాయితీ కల్పించాలని, అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు. సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన భూముల్లో ఎకరాకు ఎంత లీజు ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తక్కువ లీజుకు ఇచ్చి మహిళా సంఘాలను ప్రోత్సహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడంతో లీజు మొత్తంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.