- దోచుకుపోతుంటే సహకరించారు..
- వొచ్చే మూడేళ్లలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తి
- రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కృష్ణా నది జలాల్లో తెలంగాణాకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ బి.ఆర్.ఎస్ పాలనలోనే అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. కృష్ణా నది జలాలు ఆంధ్ర పాలకులు ఉల్లంఘనలను అతిక్రమించి దోచుకుంటుంటే సహకరించిన బి.ఆర్.ఎస్ పాలకులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా నది జలాల వివాదంపై గురువారం రోజున జలసౌధ లో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో కలసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు మంత్రులుగా పనిచేసిన బిఆర్‌ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను గత పది సంవత్సరాల బిఆర్‌ఎస్. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
1.81 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినా కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసింది గత బిఆర్‌ఎస్. ప్రభుత్వమే.. వారి హయాంలో కృష్ణా బేసిన్లో ఉన్న ఏ ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోగా నిధులు కేటాయించడంలో కూడా పూర్తి నిర్లక్ష్యం వహించారు. అందువల్ల ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కోల్పోయింది. నల్గొండ జిల్లాలోని ఎస్‌ఎల్బీసీ సొరంగం ద్వారా నిండే, రిజర్వాయర్స్ కెపాసిటీ 10 టీఎంసీలు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రిజర్వాయర్స్ కెపాసిటీ 25 టిఎంసిలు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిజర్వాయర్స్ కెపాసిటీ 65 టిఎంసిలు. ఈ మూడు ప్రాజెక్టులే కాకుండా కృష్ణా బేసిన్ లోని వివిధ దశల్లో ఉన్న ఇతర ప్రాజెక్టులకు బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించకుండా పూర్తి నిర్లక్ష్యం వహించి దక్షిణ తెలంగాణలో కరువు పరిస్థితులను తెచ్చింది బిఆర్‌ఎస్ హయాంలోనే అని మంత్రి ఉత్తమ్ విమర్వించారు.
గత పదేళ్ల నుంచి వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ చేయలేదని, దీంతో ఆ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదన్నారు. దీనివల్లే కృష్ణా బేసిన్ లోని కొన్ని ప్రాజెక్ట్ లలో కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయని, కృష్ణా బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగక పోవడానికి గత పది సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కారణమని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మా కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చే మూడు సంవత్సరాలలో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్ట్ లను అన్నింటిని పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.