ఈనెల 22వ తేదీ నుంచి అన్ని శాఖల ఉద్యోగులకు వర్తింపు
సచివాలయంలో పని చేసే అన్ని స్థాయిల ఉద్యోగులకు ఈనెల 22వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన సర్కులర్ మెమోను 3124/ఎస్‌బి/2023, తేదీ 19.11.2024ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేశారు. సచివాలయంలోని ప్రతి అంతస్థులో ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ మిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉద్యోగులు సచివాలయానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలని సిఎస్ శాంతికుమారి ఈ సర్కులర్ మెమోలో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫెఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ వర్తించనుంది. ఇప్పటివరకు రిజిస్ట్రర్‌లలో ఉద్యోగులు సంతకాలు చేసేవారు. అయితే కొన్ని శాఖల్లో ఉద్యోగులు రాకపోయినా అటెండెన్స్ రిజిస్ట్రర్‌లలో సంతకాలు పెడుతున్నారని ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్‌ను అమల్లోకి తీసుకొస్తోంది.