రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఆదివారం ఉదయం నుంచే స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు అధికంగా రావడంతో ఆలయ అధికారులు సౌకర్యాలను కల్పించారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావటంతో రాష్ట్రంలో పలు పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లో భారీగా భక్తులు బారులు తీరారు. ఆలయ మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రసాదాల కౌంటర్, శివాలయం, ఆలయ బస్టాండ్‌తో పాటు పలు ప్రాంతాలన్నీ భక్తులతో జన సంద్రంగా మారాయి. స్వామి వారి ఉచిత దర్శనానికి 3 గంటలు సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులు 2 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరగడంతో ఆయా ఆలయాల్లో అధికారులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రసాద కౌంటర్ల దగ్గర ఎలాంటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో…
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామివారికి ప్రీతిపాత్రమైన కొడె మొక్కులను చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా గర్భాలయంలో అభిషేకాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. స్వామి వారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయ వద్దకు రావడంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. లక్ష్మణ సమేత సీతారాముల వారికి విశేష అభిషేకం నిర్వహించి అర్చకులు అనంతరం బంగారు పుష్పాల అర్చన చేశారు. భక్తుల రద్దీ పెరగటంతో నిత్య కల్యాణ వేడుకను చిత్రకూట మండపంలో నిర్వహించారు. దంపతులు పాల్గొని వేడుకను తిలకించారు.