Friday, August 30, 2024

R‌hythu Bandhu నేడు రైతు రుణ మాఫీ అమలుకు శ్రీకారం

లక్ష వరకున్న రుణాలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ
బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం
రైతులకు సందేశం ఇవ్వనున్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు పిలుపు
నేడు ఉదయం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సిఎం సమావేశం

రైతు రుణమాఫీ పథకంలో భాగంగా నేడు గురువారం సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ. 2 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌దానిని అమలు చేసే దిశగా నేడు తొలి అడుగు వేయనుంది. నేడు రూ. లక్షలోపు రుణాలున్న రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆ మొత్తం జమ కానుంది. కాగా రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉండగా..70 లక్షల మంది రైతులకు రుణాలున్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్‌ ‌కార్డులు లేవు. ఇదే విషయమై ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వొచ్చిన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్లతో జరిగిన సమావేశంలో రేషన్‌ ‌కార్డు కేవలం కుటుంబ వివరాలు తెలుసుకోవడానికి మాత్రమేనని, రుణ మాఫీ రైతు పట్టాదారు పాస్‌ ‌బుక్‌ ఆధారంగానే రూ. 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రేషన్‌కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వమని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకుని వొచ్చి..ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారితో కలిసి సంబురాలు జరుపుకోనున్నారు. ఇందుకోసం జిల్లాల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వొస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.  కాగా రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమని, దీని అమలుపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఏ ఒక్క  రైతుకూ నష్టం జరుగవొద్దని సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. నేడు ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలని, సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని, ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని ఉన్నతాధికారులకు, బ్యాంకర్లకు సిఎం రేవంత్‌ ‌దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వాటిని వినియోగించవొద్దని, గతంలో కొందరు బ్యాంకర్లు ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, తామూ ఇప్పుడు అలాగే చేస్తామని సీఎం పేర్కొన్నారు.

ఇది లావుంటే నేడు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్‌ ‌లేదా సెక్రెటరీయేట్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు హాజరుకానున్నారు. లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ అమలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై బ్యాంకర్లకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో అన్ని మండల కేంద్రాలలో ఉన్న రైతు వేదికల్లో రైతుల సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్‌ ‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా రైతులనుద్దేశించి సీఎం రేవంత్‌ ‌రెడ్డి సందేశం ఇవ్వనున్నారు. కాగా ఈ నెలాఖరు వరకు లక్షన్నర ఉన్న రుణాలు, ఆగస్టు 15 కల్లా రెండు లక్షల వరకు రుణ మాఫీ చేయనున్నామని సిఎం ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
- Advertisment -

Most Popular