-
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు, వ్యాపారులకు
-
నష్టం కలిగిస్తే సహించేది లేదు
-
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
-
రైతులను మోసగించడానికి యత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
-
అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు, వ్యాపారులు నష్టం కలిగిస్తే సహించేది లేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన తెలిపారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరలు నిర్ణయించారని వచ్చిన కథనాలపై ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా సిఎం రేవంత్ స్పందించారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి, రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అడిషనల్ కలెక్టర్‌కు సిఎం రేవంత్ అభినందన
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌ను సిఎం అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాల ద్వారా
రాష్ట్రంలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను చేపడుతున్నారు. 75.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.