- సమన్వయంతో రైతు పండుగను విజయవంతం చేయాలి
- 30వ తేదీ సదస్సుకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఈనెల 28, 29,30 తేదీల్లో మహబూబ్ నగర్లో నిర్వహించే రైతు పండుగ సదస్సు విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సూచించారు. రైతు పండుగ సదస్సు ఏర్పాట్లపై మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహలతో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందని, ముఖ్యంగా రైతు రుణమాఫీతో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం 20 నుంచి 30 వేల మంది రైతులకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు.
రైతులకు పెద్ద ఎత్తున చేకూరిన ఈ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఈ రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. ఈనెల 28 న ఉదయం 10 గంటలకు రైతు సదస్సు ప్రారంభమవుతుందని, మొదటి రోజు సదస్సుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు హాజరవుతారన్నారు. ఈ ప్రారంభ సమావేశాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తాను ప్రారంభిస్తానని, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు హాజరవుతారని తుమ్మల చెప్పారు. రెండోరోజైన 29న మహబూబ్ నగర్ జిల్లాయేతర ప్రాంతాలనుండి రైతులు హాజరవుతారని, 30న రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి కనీసం లక్షమంది రైతులు ఈ రైతు సదస్సుకు హాజరవుతారని వివరించారు.
మొదటి రెండు రోజులు ప్రతి రోజు ఐదువేల మంది రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 30వ తేదీ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ మూడు రోజులు రైతు సదస్సు వేదికపై ఆదర్శ రైతులచే ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మత్స్య తదితర రంగాలకు చెందిన ఆదర్శ రైతులచే ప్రసంగాలు, విజయగాథలపై వీడియో ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఒక్కొక్క పంటకు సంబంధించి ఒక్కొక్క ఆదర్శ రైతు, వారి అనుభవాలు ఈ సదస్సులో వివరిస్తారని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.