Monday, January 27, 2025

వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

  • అక్కడికక్కడే ఏడుగురి దుర్మరణం
  • మరికొందరి పరిస్థితి విషమం..  

వరంగల్‌  ‌ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న ఇనుప రాడ్ల  లోడు రెండు ఆటోలపై పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌-‌మామునూరు రహదారిపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.  రైల్వే ట్రాక్స్ ‌కు ఉపయోగించే ఇనుప రాడ్లను  తరలిస్తున్న లారీ భారత్‌ ‌పెట్రోల్‌ ‌బంక్‌  ‌సమీపంలోకి రాగానే రెండు ఆటో రిక్షాలను ఓవర్‌టేక్‌ ‌చేయడానికి ప్రయత్నించింది. వేగంగా ముందుకు దూసుకెళ్లే క్రమంలో అందులోని ఇనుప రాడ్లు కదలి ఆ ఆటోలపై పడ్డాయి. దీంతో ఏడుగురు దుర్మణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. వీరి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని  స్థానికులు, పోలీసులు వెంటనే ఎంజీఎంకుతరలించారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

మద్యం మత్తులో లారీ డ్రైవర్‌
‌ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ ‌మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రైవర్‌ ‌నిర్లక్ష్యమే ఈ ఘోర సంఘటనకు ప్రధాన కారణమని  పోలీసులతోపాటు స్థానికులు భావిస్తున్నారు. లారీపై ఇనుప రాడ్లను సరిగా లోడ్‌ ‌చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఈ రహదారిపై  భారీ వాహనాలు వేగంగా ప్రయాణి స్తుంటాయని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అనేక మంది బలవుతున్నారని అంటున్నారు.  భారీ వాహనాలను రద్దీని నియంత్రించాల్సిన పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో ప్రమాదాలు పరిపాటిగా మారాయని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వాహనాలను నిత్యం తనిఖీలు చేయాలని, డ్రైవర్ల స్థితిని పరిశీలించాలని కోరుతున్నారు. అలాగే లోడ్‌తో వస్తున్న లారీలను  ఆపి  సరైన పద్ధతిని పాటించారా.. లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని అంటున్నారు.

సీఎం రేవంత్‌ ‌దిగ్భ్రాంతి
వరంగల్‌ ‌శివారులోని మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆ జిల్లా కలెక్టర్‌ను, పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా, వరంగల్‌ ‌జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ లారీ ఆటోలపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోల్లో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీలో ఓవర్‌ ‌లోడుతో తెస్తున్న ఐరన్‌ ‌పట్టాలు ఆటోలపై పడటం వల్లే ఈ విషాదం చోటుచేసుకుంది. వరంగల్‌-‌మామునూరు శివారులోని భారత్‌ ‌పెట్రోల్‌ ‌బంక్‌ ‌సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com