Saturday, September 14, 2024

నాన్నే నరరూప రాక్షసుడు కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి – అయిదేళ్ల కుమార్తెపై అత్యాచారం

అమ్మా.. నన్నెందుకు మళ్లీ ఈ రాక్షసుడి దగ్గరికి తీసుకొచ్చావు. నీకు తెలుసు కదా.. ఇతను మనిషి కాదు.. మానవ రూపంలో ఉన్న మృగం అని. నేను పసికందుగా ఉన్నప్పుడే తప్పు దృష్టితో చూశాడని చెప్పావు కదమ్మా. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని నన్ను అలర్ట్ చేశావు. నాన్న మన దగ్గర ఎందుకు లేడు అని అడిగిన ప్రతిసారి.. ‘నీకు నాన్న లేడమ్మా.. తనో మృగం’ అని చెప్పావు. ఇప్పుడు ఆ మృగం దగ్గరికే నన్ను ఎందుకు తీసుకెళ్లావు. నేను నా స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు కూడా నువ్వు నన్ను ఓ కంట కనిపెట్టుకుని ఉండేదానివి. అలాంటి ఆ కీచకుడి దగ్గరికి నన్ను తీసుకెళ్లినప్పుడు ఎందుకు అప్రమత్తంగా లేవు. అందరికీ నాన్న రక్షణకవచం అంటారే? మరి నా తండ్రేంటమ్మా నన్నే భక్షించాడు. నొప్పిగా ఉందమ్మా నాకు? ఏడుపొస్తోంది? నువ్వైనా చెప్పమ్మా ఆ రాక్షసుడికి నేను కూతుర్ని అవుతాను. నాతో అలా ప్రవర్తించడం తప్పని. కన్నతండ్రి అత్యాచారం చేస్తే తనకేం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న ఐదేళ్ల పసిపాప అంతరాల్లోని ఆవేదన ఇది.

నాన్నంటే మన వెంట ఉండి నడిపించే ధైర్యం అంటారు. కళ్లలో నీళ్లు రాకుండా అనునిత్యం కాపాడేవాడంటారు. కానీ ఓ కీచకుడు మాత్రం తండ్రి ముసుగులో ఆ పసిపాప పాలిట కాలయముడయ్యాడు. మూడేళ్ల వయసున్నప్పుడు తనపై వేయకూడని చేతులు వేస్తుంటే ఆ చిట్టి తల్లి తెలుసుకోలేక పోయింది. కానీ ఓసారి అతడి ప్రవర్తన చూసిన ఆ తల్లి తన బిడ్డను ఆ కామాంధుడి నుంచి దూరంగా తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ ఆ కీచకుడు తాను మారిపోయానంటూ, ఇక నుంచి ఎలాంటి తప్పు చేయనంటూ మారీచుడి వేషం వేసి వారిని నమ్మించాడు. పెద్దల ముందుకు భార్యా పిల్లలను బాగా చూసుకుంటానని నమ్మబలికి ఇంటికి రప్పించాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆ మృగాడు చేసిన పని కన్నతండ్రి అనే పదానికి మాయని మచ్చలా మారింది.

ఏం జరిగిందంటే?

పల్నాడు జిల్లా మాచర్లలో మంగళవారం రోజున ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. వెల్దుర్తి మండలానికి చెందిన ఓ మహిళతో అతడికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. రెండేళ్ల కిందట తన పెద్ద కుమార్తెను భర్త తాకకూడని చోట తాకడం చూసింది. భర్త తీరుతో హతాశురాలైన ఆమె అతడి ప్రవర్తన చూసి ఆవేదనకు గురై పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తాజాగా రెండు నెలల క్రితం తాను మారానంటూ ఇంటికి రావాలంటూ భార్యాపిల్లలను వేడుకున్నాడు ఆ వ్యక్తి. పెద్దల ఎదుట పంచాయితీ పెట్టించి.. ఇక నుంచి మంచిగా ఉంటానని, ఎలాంటి తప్పు చేయనని అందర్నీ నమ్మించాడు. అతడి మాటలను నమ్మిన పంచాయితీ పెద్దలు ఆ మహిళకు నచ్చజెప్పడంతో ఆమె భర్త ఇంటికి వెళ్లడానికి అంగీకరించింది. అలా తన పిల్లలను తీసుకుని మళ్లీ అతడితో జీవితం పంచుకోవడానికి తిరిగివచ్చింది.

కానీ ఆ కీచకుడు మారీచుడి వేషంలో వచ్చాడని, అతడి తీరు మారలేదని ఆమె గ్రహించలేకపోయింది. పది రోజులుగా రాత్రి వేళల్లో అతడు తన భార్య, కుమార్తెకు రాత్రిపూట కూల్​ డ్రింక్​లో మత్తు మందు కలిపి తాగిస్తూ వచ్చాడు. అతడు మారిపోయాడని భావించని వాళ్లు.. ప్రేమ చూపిస్తున్నాడని మురిసిపోయి కూల్ డ్రింక్ తాగేవారు. ఇక వారు మత్తులో నిద్రపోగానే అతడిలో విషం జడలు విప్పేది. కామాంధుడు కోరలు చాచి బయటకు వచ్చేవాడు. అలా అమ్మ, నాన్న చెంత ఉన్నారన్న భరోసాతో నిద్రపోతున్న ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతూ ఉండేవాడు. పలు మార్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ కామాంధుడు. ఇటీవల ఆ చిన్నారి మూత్ర విసర్జన సమయంలో చాలా నొప్పిగా ఉంటోందని తల్లికి చెప్పుకుంది.

తన బిడ్డకు ఏమైందో అర్థంగాక ఆ తల్లి తల్లడిల్లిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ముక్కుపచ్చలారని ఆ పసికందుపై జరిగిన అఘాయిత్యాన్ని చూసి ఆవేదన చెందారు. ఇదే విషయాన్ని బాలిక తల్లికి చెప్పగా ఆమె హతాశురాలైంది. ఈ విషయమై భర్తను నిలదీసింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి తన భర్తే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అతడిని కఠినంగా శిక్షించాలని వారిని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ ప్రభాకరరావు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular