దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తగవని మంత్రి సీతక్క అన్నారు. ఆమె వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని, దీని వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయం వద్ద మంగళవారం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని, ఫిజికల్ ఫిట్‌నెస్ దేవుడు ఇచ్చేదని, ఐఏఎస్, ఐపీఎస్ పని వేరని చెప్పారు.
అనాదిగా ఒక మనస్తత్వం ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయని, ఇప్పటికైనా అలాంటివి మానుకోవాలన్నారు. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించే వారికే మానసిక వైకల్యం ఉంటుందని, దివ్యాంగులుగా ఉన్న ఎంతోమంది గొప్ప స్థానాలకు వెళ్లారని, ఇతరుల సమర్థతను గుర్తించాలని హితవు పలికారు. స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లి ఉంటాయని, తాను కూడా ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని సీతక్క తెలిపారు.