(King Johnson Koyyada)
* కాంగ్రెస్ సీనియర్లు ఇగోలు పక్కన పెట్టాలి
* కలిసికట్టుగా రేవంత్‌తో కలిసి పని చేయాలి
* అప్పుడే తెలంగాణ ప్రజలు గెలిచినట్లు!
* ప్రతిపక్షాల మాయలో పడితే అంతేసంగతులు
* తెలంగాణలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు
ఆంధ్రప్రదేశను రెండు ముక్కలుగా విభజిస్తే.. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని తెలిసినా.. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి తరుణంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థులమంటూ విర్రవీగి.. ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీని తక్కువగా అంచనా వేసి.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా 2014 ఎన్నికల్లో బోర్లపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ముంచేశారు. మొదటి ఐదేళ్లలో కనీసం బలమైన ప్రతిపక్షంగా కూడా నిలబడలేదు. కేసీఆర్ కాళేశ్వరం కడుతుంటే ఏ ఒక్క నాయకుడు ధైర్యంగా టీఆర్ఎస్‌కు ఎదురొడ్డి నిలబడి.. ఎలుగెత్తి పోరాటం చేసింది లేదు. ప్రజల్ని చైతన్యపర్చింది లేదు. కాశేశ్వరం అవినీతిపై బహిరంగంగా చర్చ జరిపింది లేదు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్‌కు బ్యాక్ ఎండ్ నుంచి సపోర్టు చేశారన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 2018 ఎన్నికల్లోనూ ప్రణాళికలంటూ లేక.. వ్యూహాత్మకంగా కేసీఆర్ మీద పోరాటం చేయడంలో విఫలమై మళ్లీ చేతులెత్తేశారీ సీనియర్లు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చినా సోనియా గాంధీని.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావు తదితరులు బహిరంగంగా విమర్శిస్తున్నా పెదవి విప్పింది లేదు. వారి వ్యాఖ్యల్ని ఖండించింది లేదు. పెద్ద ఎత్తున పోరాటం చేసింది లేదు.
కాంగ్రెస్ పార్టీ చివరి దశలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల్ని చేపట్టి.. సీనియర్ల నుంచి మద్దతు లేకున్నా.. అన్ని రకాల ఆటుపోట్లను అధిగమించి.. అందర్ని కలుపుకుంటూ పోయి.. ఒక ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా ప్రచారాన్ని నిర్వహించి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ విషయం కాంగ్రెస్ పెద్దలకు అర్థమైంది. ప్రజలకు, ప్రతిపక్షాలకు అర్థమైంది. కానీ, తెలంగాణలోని సీనియర్ నాయకులకు మాత్రం అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు అనడం కంటే.. తాము సీనియర్లమని రేవంత్ రెడ్డి ఈమధ్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తమ మీద పెత్తనం చెలాయిస్తున్నాడేమిటని అహంకారంతో లోలోపల విర్రవీగుతున్నారు. అధిష్ఠానం, కర్ణాటక నాయకుల ప్రోద్భలం, రేవంత్ రెడ్డి గట్టిపోరాటం కారణంగా.. ప్రజలు 64 సీట్లను అప్పగించి కాంగ్రెస్‌కు అధికారాన్ని అందజేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో కలిసి ఉంటే.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండొచ్చని వీరికి అర్థం కావట్లేదనిపిస్తోంది. ప్రజలకు సేవ చేయవచ్చు. తెలంగాణ చరిత్రలో తమకంటూ ఒక మంచి పేరును లిఖించుకోవచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి మీద కక్ష పెట్టుకుని, అతన్ని ఎలాగైనా గద్దె దించాలని కొందరు తెలంగాణ సీనియర్లు కుట్ర చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరి ఇగోల కారణంగా, తామే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లమని విర్రవీగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగనీ, ప్రతిపక్షాలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితిలో ఊరుకోరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కుట్రలు పన్నీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసి.. కొందరు నేతలను వెంటపెట్టుకుని.. అడ్డదారిలో ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నిస్తే తాత్కాలికంగా అధికారం రావొచ్చు గాక.. కాకపోతే, అలాంటి వారంతా తెలంగాణ రాష్ట్రంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని గుర్తుంచుకోవాలి. తెలంగాణ యువత, మేధావివర్గం, పౌరసమాజం, మీడియా హర్షించరని అర్థం తెలుసుకోవాలి.
కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తే.. మరో ఐదేళ్లపాటు అధికారంలోకి వస్తారు. అలాంటప్పుడు, సీనియర్లలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి, కాంగ్రెస్ నేతలు తెలివిగా వ్యవహరించి.. ప్రతిపక్షాల బుట్టలో పడకుండా.. ప్రజలకు మేలు కలిగించేలా పాలనను కొనసాగించాలి. ఐదేళ్లపాటు స్థిరంగా అధికారంలో కొనసాగాలి. కాంగ్రెస్ పార్టీలోని ప్రతిఒక్కరూ ఇప్పటికైనా తమ అహంకారాన్ని పక్కన పెట్టేసి.. మనసువిప్పి ఒకరికొకరు మాట్లాడుకుని.. అర్థం చేసుకుని.. ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో కొనసాగితే తెలంగాణ ప్రజలు గెలిచినట్లు అవుతుంది.
(mail your opinion on this story to editor.tsnews@gmail.com)