టీఎస్, న్యూస్:తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. శ్రీధర్ రెడ్డి పై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్ను ఎవడ్రా పిలిచింది’ అంటూ మాగంటి గోపి ఫైర్ అయ్యారు. “నువ్వేవడివి.. తనకు చెప్పడానికి’’ అంటూ రావుల శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య మాటలు పెరుగుతుండటంతో.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే తలసాని సర్ది చెప్పారు.
కొట్లాడుకుంటున్నారు
పార్టీ ఓటమితో అధినేతలు ఆయోమయంలో ఉంటే.. నేతల మధ్య విభేదాలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంపై చేపట్టిన సమీక్ష కూడా రచ్చకు దారి తీసింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక మీద నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ వర్గం నినాదాలు చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ ప్రకటించడంతో వివాదం మరింత ముదరకుండా ఆగిపోయింది. ఆ తర్వాత మహేందర్‌రెడ్డి పార్టీని వీడారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో కూడా పార్టీ నేతల మధ్య విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్‌రెడ్డి మధ్య వివాదం రచ్చకెక్కింది.