పదవుల కోసం చూస్తున్న కాంగ్రెస్ నేతలకు తీపి కబురు?
తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పంపకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరికి పదవుల ఇవ్వాలో జాబితా తీసుకుని రేవంత్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ పిలుపు మేరకు వారు ఢిల్లీ వెళ్లడంతో పదవుల పంపకం కోసం అంతా రంగం సిద్ధమయిందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ సహా పలు కేబినెట్ ర్యాంక్ హోదా గల కార్పొరేషన్ చైర్మన్ పదవుల కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని, వాటిలో తమకు అవకాశాలు కల్పించాలని చాలా మంది నేతలు ఎదురు చూస్తున్నారు.
ఆరు మంత్రి పదవుల కోసం ఇరవై మందికిపైగా పోటీ : ఆరు మంత్రి పదవుల కోసం కనీసం ఇరవై మంది ఎమ్మెల్యేలు గట్టిగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు.. జిల్లాల ప్రయత్నాలు ఇలా అన్ని సమీకరణాలు చూసుకుని పదవులు భర్తీ చేయాల్సి ఉంది. అలా చేయడం వల్ల చాలా మంది అసంతృప్తికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారిని బుజ్జగించి.. ప్రత్యామ్నాయ పదవులను ఇచ్చేలా ఒప్పించి.. పదవుల భర్తీ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే హైకమాండ్ తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చర్చించినట్లుగా తెలుస్తోంది.
రెండు మంత్రి పదవుల్ని ఖాళీగా ఉంచి ఆశావహులను ఆశల్లో ఉంచే అవకాశం : అన్నీ పదవులను భర్తీ చేయడం వల్ల అసంతృప్తి పెరుగుతున్నందున నాలుగు పదవుల్ని భర్తీ చేసి రెండు మంత్రి పదవుల్ని ఖాళీగా ఉంచడం ద్వారా ఆశావహుల్ని అలా ఆశాహులుగానే ఉండేలా చూసి..అసంతృప్తి బయటపడకుండా చూడాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇంకా కార్పొరేషన్ల పదవులపై కూడా చర్చించనున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఆమె పూర్తిగా పరిస్థితుల్ని అధ్యయనం చేసి హైకమాండ్ కు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు వస్తాయని ఆమె స్పష్టం చేశారు.
మీనాక్షి నటరాజన్ నివేదిక ఆధారంగా పదవులు : పార్టీ పదవుల్ని సుదీర్ఘంగా పార్టీలో ఉన్నవారికి, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి.. గెలిచిన తర్వాత పార్టీలో చేరిన వారికి అనే వర్గాల్లో విభజించి అత్యధిక ప్రాధాన్యత సుదీర్ఘంగా పార్టీ లో ఉన్న వారికి ఇవ్వాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీనాక్షి నటరాజన్ ఇచ్చిన నివేదిక మేరకు పదవులు ఎవరెవరికి ఇవ్వాలో ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి అతి త్వరలోనే గుడ్ న్యూస్ లభించే అవకాశాలు ఉన్నాయి.