కేంద్ర ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. మొత్తంగా చూస్తే నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.
కొత్త పథకాలను ప్రవేశపెడుతుందా.. ఉన్న పథకాలను కొనసాగిస్తుందా.. ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లింపుదారుల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. పన్ను మినహాయింపుపై నిర్ణయాలు ఉంటాయా అనే ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో కేంద్రప్రభుత్వం ఒకట్రెండు కొత్త పథకాలు మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కొనసాగించనున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కొనసాగింపు
ఇళ్లులేని పేద, మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తుంది. ఇది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మొదట 2025 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోగా.. ఇంకా ఇళ్లులేని వారి సంఖ్య అధికంగా ఉండటంతో ఈ పథకాన్ని కేంద్రం కొనసాగించనుంది. ఇవాల్టి బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి భారీగా నిధులు కేటాయించనుంది.
యువతకు గుడ్‌న్యూస్..
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కేంద్రప్రభుత్వం గత పదేళ్లుగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలను ప్రకటిస్తూ వస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లకు భారీగా రాయితీలను ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఆదాయపన్ను మినహాయింపు
ప్రస్తుతం ఏడాదికి రూ.3లక్షల ఆదాయం వరకు ఎలాంటి ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితిని పెంచే అవకాశం ఉందని గత రెండేళ్లుగా ప్రచారం జరిగిన పన్నుదారులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఈసారి మాత్రం రూ.5లక్షల వరకు పన్ను మినహాయింపు పరిమితిని పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచితే ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉండటంతో ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసారైనా పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.