తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మళ్ళీ తుపాకుల మోత మొగింది. అబూజ్‌మడ్ దండకారణ్యంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల తుపాకుల మోతలతో దద్దరిల్లింది. ఈ సంఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులతో పాటు ఐదుగురు హతమయ్యారు. ఇద్దరు జవాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్‌కి తరలించారు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా కాంకేర్ దండకారణ్యం పరిధిలోని టేకుపేట కాకూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత అభయ్ ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్, డిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్ బలగాలు అటవీ ప్రాంతంలోకి వెళ్ళాయి.
భద్రతా బలగాలను చూసి మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో ప్రతిఘటించిన భద్రతా బలగాలు కాల్పుల వర్షం కురిపించారు. ఈ సంఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులతో పాటు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరి వద్ద నుండి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు అబూజ్‌మడ్ ప్రాంతంలో వారి ఉనికిని చాటుకునేందుకు సమావేశం కావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రత బలగాల కాల్పులకు భారీగా మావోయిస్టులు గాయపడి ఉంటారని భావిస్తూ దండకారణ్యాన్ని భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడిరచారు. గాయపడిన ఇద్దరు జవాన్‌లు డిఆర్‌జికి చెందిన హిర్మాన్ యాదవ్, బస్తర్ కాంకేర్ జిల్లాకు చెందిన ఖిలేశ్వర్ గావ్డే లను మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్‌కి తరలించారు.
మరికొంత మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని అటవీ ప్రాంతాన్ని భద్రత బలగాలు జల్లెపడుతున్నాయి. గత నెల అక్టోబర్ 4న అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 31 మంది మావోయిస్టులు చెందడం జరిగింది.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కాంకేర్ ఎస్పీ ఐకె ఎలిసిలా పేర్కొన్నారు. దీనితో మావోయిస్టు పార్టీకి భారీగా నష్టం జరిగింది. అయితే అక్టోబర్ 14న మావోయిస్టు పార్టీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఒక ప్రెస్‌నోట్ విడుదల చేసారు.
చనిపోయిన మావోయిస్టులు 31 మంది కాదని 35 మంది తమ పార్టీకి చెందిన మావోయిస్టులు మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. మళ్ళీ నవంబర్ 16న మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి మావోయిస్టులు పూర్తిగా నిర్మూళించాలని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. కేంద్ర బలగాలను కూడ భారీగా కేంద్ర హోం శాఖ దండారణ్యానికి పంపించినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లింది.