తెలంగాణలో మొట్టమొదటి కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి లో ఈ కంటైనర్ స్కూల్ ను నిర్మించారు. బంగారుపల్లి తండా గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో ఉంటుంది. అందుకని ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీశాఖ అనుమతించడం లేదు. దీంతో బంగారుపల్లి తండాలోని పిల్లలు ఇన్ని రోజులు ఓ గుడిసెలో విద్యాభ్యాసం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో టీచర్ ఉన్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వకపోవడంతో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర సరికొత్తగా ఆలోచించి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కంటెయినర్ పాఠశాల ఏర్పాటుకు పూనుకున్నారు.
కలెక్టర్ నిధులు నుంచి 13 లక్షల రూపాయలతో చేపట్టిన కంటైనర్ స్కూల్ పనులు పూర్తికావొచ్చాయి. ఈ కంటెయినర్ స్కూల్ 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో 12 వరకు డ్యూయల్ డెస్కులతో పాటు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఉండేలా నిర్మించారు. వచ్చే వారం పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఈ కంటైనర్ పాఠశాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు కంటైనర్ షాుపులు, ఇళ్లు మాత్రమే చూశాం కదా.. ఇదిగో ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటి కంటైనర్ స్కూల్ కూడా వచ్చేసింది.