- అధికారులను ఆదేశించిన మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క
- సచివాలయంలో తెలంగాణ విద్యావ్యవస్థపై మంత్రివర్గ ఉప సంఘం తొలి భేటీ
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోచింగ్ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలని తెలంగాణ విద్యావ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం సంబంధిత అధికారులను ఆదేశించింది. పాఠశాల నుంచి యునివర్సీటి స్థాయి వరకు విద్యా రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తేవాల్సిన సంస్కరణలపై ప్రాథమికంగా చర్చించారు. తెలంగాణ విద్యావ్యవస్థలో తీసుకు రావాల్సిన ముఖ్యమైన సంస్కరణల గురించి చర్చించారు. మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సభ్యురాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి అనసూయ సీతక్క ఆధ్వర్యంలో బుధవారం తొలి సమావేశం సచివాలయంలో బుధవారం జరిగింది. ఈ సమావేశం రాష్ట్రంలో కోచింగ్ సెంటర్లు పాటించాల్సిన మార్గదర్శకాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో జరిగిన కోచింగ్ సెంటర్ విషాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కోచింగ్ కేంద్రాలు పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలు రూపొందించి, అన్ని రాష్ట్రాలు ఆ ఆదేశాలను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాము జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపధ్యంలో మంత్రివర్గ ఉప సంఘం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అన్ని కోచింగ్ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా అమలు చేయాల్సిందేనని అన్నారు. ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. కోచింగ్ సెంటర్ల నియంత్రణపై కేంద్రం గైడ్ లైన్స్ ను అమలు చేసి వీటిని కట్టడి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పైవేటు స్కూళ్లు, ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల నిర్దారణపై నియంత్రణ కమిటీ ఏర్పాటే చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు శ్రీధర్ బాబు వెల్లడించారు. అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను వేర్వేరుగా నడపడం వల్ల మానవ వనరుల వృథా జరుగుతోందని రెండింటిని విలీనం చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. విద్యార్థులు లేని 1600 పాఠశాలల్లోని ఉపధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని సూచించారు. డిగ్రీ కళాశాలల్లో బిఏ కోర్సుల పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసి విద్యార్థులను ఉద్యోగాలకు సంసిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసే పనులను వేగవంతం చేయాలని చెప్పారు. మాసబ్ ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్, కులీకుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ వ్యక్తిత్వ విలువలు, సమాజ వికాసాన్ని పెంచే విద్యా విధానం రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సెలబస్‌ను సవరించాలన్నారు. అప్పుడే మార్పునకు నాందిపడుతుందని చెప్పారు. విద్యార్ధులకు మంచి మార్కులతో పాటు మంచి నడవడిక నేర్పేలా మార్పులు జరగాలని సూచించారు. అమ్మాయిలు, మహిళలు అంటే చిన్న చూపు పొగొట్టేలా, లింగ సమానత్వం సాధించే దిశలో సెలబస్‌లో పాఠాలను చేర్చాలని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధన్యతనిస్తున్నందున ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీలను భర్తి చేస్తున్నామని, ఏండ్లుగా ఉన్న పదోన్నతుల అంశాన్ని పరిష్కరించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఎంఈఓలను, డీఈఓలను నియమించకపోవడంతో పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. పర్యవేక్షణ అధికారులను నియమించి నిరంతరం పర్యవేక్షణ కొనసాగే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీటెక్, ఎంటెక్ ఫీజులకన్నా కేజీ చిన్నారుల ఫీజులు కొన్ని పాఠశాలల్లో అధికంగా ఉన్నాయని, ఫీజులను నియంత్రించేలా నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థను మెరుగుదల కోసం ఇంటిగ్రేటెట్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అత్యాధునిక ప్రమాణాలతో కూడిన విద్య పేదలకు అందేలా దేశానికే ఆదర్శంగా నిలిచే సరికొత్త విద్యా విధానం రూపొందిస్తామని స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల్లో జాతీయ విద్యావిధానం అమలుపై నివేదిక ఇవ్వండి
కేంద్రం తెరమీదకు తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఇతర రాష్ట్రాల్లో నూతన జాతీయ విద్యావిధానం అమలు తీరు, సాదక బాధకాలపై నివేదిక అందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఉద్యోగ అవకాశాలు మెరుగు పర్చేలా ఐటీఐలను ఏటీసీలు గా ఆదునీకరించినట్లుగానే, పాలిటెక్నిక్ కళాశాలలను అప్ గ్రేడ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇంటర్ కాలేజీ నుంచి యునివర్సీటి వరకు అన్ని స్థాయిలో లెక్చరర్ల నియామకం కోసం కాలేజీ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసే అంశంపై కూడా చర్చించినట్లు వివరించారు. డిగ్రీ విద్యార్దుల నైపుణ్యాన్ని పెంచేలా పాలిటెక్నిక్ కాలేజీల మాదిరిగా ఇంటర్న్ షిప్‌ను చేర్చే అంశాన్ని కూడా పరిశీలించాలని కమిటీ అధికారులను ఆదేశించింది. వీటితో పాటు విద్యా రంగంలో తేవాల్సిన పలు ఇతర సంస్కరణలపై రెండు గంటలకు పైగా చర్చించినట్లు వివరించారు. మరిన్ని సమావేశాలు జరిపి వీలైనంత త్వరగా ప్రస్తుత కాలానికి సరిపడే విద్యా విధానాన్ని ప్రభుత్వం రూపొందించనుందని తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో మంత్రులతో పాటు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలిచైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ అదనపు కార్యదర్శి లలిత, డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శృతి ఓజా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.