Monday, November 18, 2024

కొత్తగా దొరికారు చిన్న మిస్టేక్.. ఆ దొంగల ముఠాను పట్టించింది

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివారులోని వెల్లటూరు కాలనీలో బ్రిక్స్‌ వ్యాపారి తమ్మిశెట్టి వెంకయ్య ఇంట్లో ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున దోపిడీకి పాల్పడిన దొంగల ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అలానే కేసు వివరాలను వెల్లడించారు.

అందివస్తున్న ఆధునిక టెక్నాలజీని పోలీసులతో పాటు దొంగలు కూడా వినియోగిస్తున్నారు. ఒక్కొక్కసారి ఎంతటి తెలివిగల దొంగలైనా.. ఎక్కడో ఒకచోట పప్పులో కాలు వేయడం సహజం. ఆ దొంగలు చేసిన తప్పిదాన్ని టెక్నాలజీ సహాయంతో పసిగట్టి.. వారిని కటకటాల్లోకి నెడుతున్నారు పోలీసులు. ఇంతకు ఆ దొంగలు ముఠా పోలీసులకు ఎలా చిక్కారంటే తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

ఏపీకి చెందిన డ్రైవర్ వేమవరపు నాగరాజు.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెంలో బంధువుల ఇంటికి తరచూ వచ్చివెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆయనకు మేళ్లచెర్వుకు చెందిన మిర్చి వ్యాపారి వేముల వెంకటేశ్వర్లుతో పరిచయమైంది. డబ్బులు అవసరం కాగా నాగరాజు ఎక్కడైనా చోరీ చేయాలని భావించి ఆ విషయాన్ని వెంకటేశ్వర్లుతో చర్చించాడు. అందుకోసం వెల్లటూరు కాలనీలో డబ్బులు ఉన్న తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ఇంటిలో చోరీ చేయాలని నాగరాజు భావించాడు. ఈ దొంగతనం చేసేందుకు పాత మిత్రులైన ఏపీకి చెందిన వేమవరపు పుల్లారావు, భిక్షం, నల్లగొండ జిల్లాకు చెందిన రమావత మాత్రు, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన చిక్కల ఆంజనేయులను సంప్రదించాడు.

అందరూ కలిసి ఈ నెల 19న తెల్లవారుజామున 3 గంటల సమయంలో వెంకటేశ్వర్లు ఇంట్లోకి చొరబడి అతడితో పాటు ఇద్దరు కుమార్తెలను కత్తులతో బెదిరించారు. వారి నుంచి ఆరున్నర తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దోపిడీ జరిగిన ఇంటిని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఎస్పీతో పాటు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. కేసును ఛేదించేందుకు ఏడు పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశారు. నేరానికి పాల్పడిన వ్యక్తులు మేళ్లచెర్వు వద్ద దుకాణంలో మద్యం కొనుగోలు చేసి వారి ఫోనపే ద్వారా డబ్బులు చెల్లించారు. అలాగే ముఠా ఉపయోగించిన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన నెంబరుతో ఉంది. పోలీసులు దిశగా టెక్నాలజీ సాయంతో విచారణ చేసి నేరానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించారు.

అనంతగిరిమండలం శాంతినగర్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వెల్లటూరుకాలనీలో వెంకటేశ్వర్లు నివాసంలో చోరీ చేసినట్లుగా ముఠా అంగీకరించింది. దీంతో నిందితుల నుంచి రూ.6.38 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదు, కారు, ఐదు కత్తులు, చేతి గ్లౌజులు, మాస్కులను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మొత్తానికి నిందితులు వాడిన ఫోన్ పే వారిని పట్టించింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular