ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్న ప్రజలు
అగ్ర రాజ్యం అమెరికా భారీ వరదలతో అతలాకుతలం అవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు వందల ఇళ్లు నీట మునిగాయి. మరీ ముఖ్యంగా ఐయోవా రాష్ట్రంలో ఐదారు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా కౌంటీలు జలమయం అయ్యాయి. అధికారుల ఆదేశాలతో ముందుస్తు జాగ్రత్తలో భాగంగా ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు.
అటు రాక్ వ్యాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోవడంతో చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లతో పాటు కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. సముద్రపు తీరంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సియోక్స్ ఫాల్స్ లోని ఫాల్స్ పార్కుడా బ్రిడ్జి కింద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు.
నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మాడిసన్ సెయింట్ ప్రాంతంలో పెద్దు ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. వాలంటీర్లు, స్థానికులు వరదలను అడ్డుకునేందుకు ఇసుక సంచులను పేరుస్తూ రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జల దిగ్బంధంలో ఉన్న యూఎస్ రాక్ వ్యాలీ సిటీలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.