Sunday, April 20, 2025

తెలంగాణలో స్వైన్ ఫ్లూ కేసుల కలకలం-జాగ్రత్తలు తప్పనిసరి

భారీ వర్షాలు, వరదలత ఇప్పటికే తెలంగాణ అతలాకుతలం అవుతోంది. ఎడతెరపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో విష జ్వరాలు ప్రబలడం సర్వసాధారణం. ఇప్పటికే చాలా మంది జనం వైరల్ జ్వరాలతో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యూ సహా పలు రకాల విష జ్వరాలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణలో స్వైన్‌ ఫ్లూ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. కొన్నేళ్ల తరువాత రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ కేసులు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ నారాయణగూడ లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ నాలుగు స్వైన్ ఫ్లూ కేసులను నిర్ధారించడం అటు రాష్ట్ర ప్రభూత్వాన్ని, ఇటు సామాన్య జనాన్ని అందోళనకు గురిచేస్తోంది.

హైదరాబాద్ మాదాపూర్‌ లో ఉంటున్న పశ్చిమబెంగాల్‌ కు చెందిన 23 ఏళ్ల యువకుడు తీవ్ర దగ్గు, జ్వరం, జలుబు.. తదితర లక్షణాలతో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడి వైద్యులు ఫ్లూ లక్షణాలుగా అనుమానించి నారాయణగూడ ఐపీఎంకు శాంపిల్స్ పంపించారు. పరీక్షలు నిర్వహించిన ఐపీఎం స్వైన్‌ ఫ్లూ లక్షణాలుగా నిర్ధారించింది. ఇక హైదర్‌నగర్‌ డివిజన్‌లోని 51 ఏళ్ల మహిళ, టోలిచౌకికి చెందిన 69 ఏళ్ళ వృద్ధుడు, నిజామాబాద్‌ జిల్లా పిట్లం మండలానికి చెందిన మరో 45 ఏళ్ల వ్యక్తికి స్వైన్‌ ఫ్లూ సోకినట్లు పరీక్షల్లో తెలింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్సకు వచ్చిన ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన 68 ఏళ్ల మహిళకు కూడా స్వైన్‌ ఫ్లూ సోకినట్లు తెలుస్తోంది. దీంతో నగరంలో ప్రస్తుతం 5 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అందుకే ప్రజలు తగిన జార్గత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

స్వైన్ ఫ్లూ లక్షణాలు.
స్వైన్‌ ఫ్లూ వ్యాధి H1 N1 అనే వైరస్‌ మూలంగా వస్తుంది.
స్వైన్‌ ఫ్లూలోనూ సాధారణ ఫ్లూ జ్వరం లక్షణాలే కనిపిస్తాయి.
జలుబు, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రధాన లక్షణాలు
ముక్కు కారటం, జ్వరంతో పాటు దగ్గు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటాయి.
కొందరికి వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి
ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం అలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

స్వైన్ ఫ్లూ సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
స్వైన్‌ ఫ్లూ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వ్యాపిస్తుంది. ఫ్లూ బారినపడిన రోగులు దగ్గినా, తుమ్మినా వైరస్‌ గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీలిస్తే ఇతరులకూ ఫ్లూ సోకుతుంది. అందుకే మాస్కులు ధరించాలి.
జ్వరంతో పాటు తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటే.. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
కుటుంబ సభ్యులెవరైనా స్వైన్ ఫ్లూ బారిన పడితే మిగిలినవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
స్వైన్ ఫ్లూ బారిన పడకుండా రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి జ్యూస్, పండ్లు ఎక్కువగా తీసుకుంటే రోగ నిరోధకశక్తి బాగా వృద్ధి చెందుతుంది.
సమతుల ఆహారం, సమయానికి భోజనం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడంతో పాటు వ్యాయామం తప్పనిసరి.
స్వైన్‌ ఫ్లూ రాకుండా కాపాడుకోవడానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఆరేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు డాక్టర్ల సలహాతో టీకా తీసుకోవటం మంచిది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com