- ప్రమాదాల నియంత్రణలకు ప్రభుత్వం సన్నద్ధం
- త్వరలోనే టెండర్‌లు, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని నిర్ణయం
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్- టు విజయవాడ నేషనల్ హైవే ఒకటి. ఈ నేషనల్ హైవే- 65పై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎపి, తెలంగాణ మధ్య ఈ రహదారి వారధిలా ఉంటుంది. అయితే రద్దీగా ఉండే ఈ రహదారిపై తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ హైవేపై కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్ధమైంది.
సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే వాహనదారులకు యూటర్న్ కష్టాలు తప్పనున్నాయి. దీంతోపాటు హైదరాబాద్- టు విజయవాడ నేషనల్ హైవేపై పలుచోట్ల ప్లైఓవర్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆదిశగా టెండర్‌లను పిలవడం, వెంటనే పనులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆరు వరుసలుగా విస్తరణ..
ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రహదారి ఆరు వరుసలుగా మారనుంది. ఈ మేరకు కీలక ముందడుగు పడింది. గతంలో ఈ జాతీయ రహదారి రెండు వరసలుగా మాత్రమే ఉండేది. 2010లో అప్పటి ప్రభుత్వం రహదారిని విస్తరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ వరకు మెుత్తం 181.50 కి.మీ మేర రహదారిని నాలుగు వరుసలుగా డైవర్షన్ చేసింది.
తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్, ఎపిలోని చిల్లకల్లు సమీపంలో టోల్ గేట్లను ఏర్పాటు చేశారు. అయితే రహదారి విస్తరణ కోసం అప్పట్లోనే భూమిని సేకరించారు. కానీ, విస్తరణ జరగలేదు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీని కలిశారు. రోడ్డు విస్తరణపై చర్చించగా అందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే విస్తరణ పనులు మెుదలు కానున్నాయి. ఇక ఈ రహదారిపై అధికారులు మెుత్తం 17 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. అక్కడ అండర్‌పాస్‌లు, సర్వీసు రోడ్లను నిర్మించనున్నారు.