గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్‌సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కమిటీలో హెడ్ మాస్టర్, ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారు. అదే విధంగా ఫుడ్ పాయిజన్ కారణాలు తేల్చేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫుడ్ పాయిజన్‌కు కారణాలు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులు ఉండే ఈ కమిటీలో ఒక ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఓ అదనపు డైరెక్టర్, ఒక జిల్లా స్థాయి అధికారి ఉంటారు. గురుకులాలు, హాస్టళ్లలో ఆహార నాణ్యతను ఈ బృందం పరిశీలించనుంది. వీటితో పాటు అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతనూ పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి, బాధ్యులను గుర్తించనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హెడ్ మాస్టర్, ఇద్దరు పాఠశాల సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలని సర్కార్ ఆదేశించింది. వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్ధారించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
ఇటీవల నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో విద్యార్థులు 3సార్లు ఫుజ్ పాయిజన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలవడమేమిటని, ఇలా జరుగుతుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది నిదర్శనమని, ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమైంది.